AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nightmares: రాత్రిళ్లు పీడకలలు వస్తున్నాయా..? అవి దేనికీ సంకేతమో తెలుసా..

నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. ఐతే ఒక్కోసారి నిద్రలో పీడకలలు వచ్చి కలవరపెడుతుంటాయి. ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, దయ్యాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్లు.. ఇలా..

Nightmares: రాత్రిళ్లు పీడకలలు వస్తున్నాయా..? అవి దేనికీ సంకేతమో తెలుసా..
Nightmares
Srilakshmi C
|

Updated on: Mar 22, 2023 | 1:03 PM

Share

నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. ఐతే ఒక్కోసారి నిద్రలో పీడకలలు వచ్చి కలవరపెడుతుంటాయి. ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, దయ్యాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్లు.. ఇలా భయపెట్టే కలలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ భయంతో రాత్రంతా నిద్రపోకుండా ఆందోళన చెందుతుంటాం. కొందరిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకునేవారు చాలా తక్కువ. అవే వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ ఇలాంటి పీడకలలు భవిష్యత్తులో రాబోయే మతిమరుపుకు సూచనలు అంటున్నారు పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హోమ్ పరిశోధకుల అధ్యయనాల ప్రకారం ఇలా తరచూ పీడకలలు వచ్చే వారికి మతిమరుపు (డిమెన్షియా) వచ్చే అవకాశం ఎక్కువట. ముఖ్యంగా మధ్యవయసులో తరచూ పీడకలలు వచ్చేవారికి వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం పొంచి ఉంటున్నట్టు తేలింది. పీడకలలకూ విషయగ్రహణ సామర్థ్యం తగ్గటానికి, డిమెన్షియాకూ సంబంధం ఉంటున్నట్టు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. ఇలాంటి వారికి ఏదైనా విషయం చెబితే త్వరగా అర్థంకాదని, కొన్నిసార్లు మర్చిపోవడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.

అధ్యయనంలో భాగంగా 35-78 ఏళ్లు పైబడిన దాదాపు 2,600 మంది సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. 38 ఏళ్లు దాటిన వారికి తరచూ పీడకలలు వేధిస్తే సరిగ్గా పదేళ్ల తర్వాత విషయగ్రహణ సామర్థ్యం లోపించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వృద్ధులకైతే డిమెన్షియా వచ్చే అవకాశం 2 రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఆడవారి కన్నా మగవారిలోనే పీడకలల కారణంగా మతి మరుపు వచ్చే అవకాశం అధికమని చెప్పారు. అయితే పీడకలలు మతిమరుపు వచ్చేలా చేయడానికి కారణాలు ఏంటో ఇంకా తెలుసుకోలేదు. పీడకలలకు, డిమెన్షియాకు మధ్య సంబంధాన్ని నిర్ధరించటానికి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్ని పీడకలలు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతాయి. నిజజీవితంలో ఉన్న భయాలు కూడా పీడకలల రూపంలో వేధించవచ్చు. పీడకలల వల్ల నిద్రపట్టకపోవడం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. లేకుంటే వాటి వల్ల కలిగే భయం మానసిక సమస్యలకు దారితీస్తాయని, పీడకలలను తేలికగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.