మద్యం అలవాటుతో ఆకస్మిక గుండెపోటు ముప్పు.. ఇందులో నిజమెంత?
నేటి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి ప్రతిరోజూ చేసే మన రోజు వారీ అలవాట్లు గుండెను దెబ్బతీస్తూనే ఉంటాయి. శరీరం కూడా దీని గురించి సంకేతాలను ఇస్తుంది. కానీ వీటిని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం కూడా గుండెపోటుకు కారణం అవుతుంది. ముఖ్యంగా మద్యం తాగడం వల్ల గుండెపోటు వస్తుందా? అనే సందేహం ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

గుండెపోటు లక్షణాలు నిర్ణీత రోజు కంటే దాదాపు ఒక నెల ముందు నుంచే కనిపిస్తాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం తల తిరగడం, కాళ్లలో వాపు, నిరంతరం అలసట, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో భారం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే ఇవి గుండెపోటు లక్షణాలుగా భావించాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. రక్తం గుండెకు చేరడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు. రక్తం ఇతర అవయవాలను చేరుకోలేనప్పుడు ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని ఆహారాలు గుండెపోటుకు కారణమవుతాయి.
గులాబ్ జామ్, బర్ఫీ, ఐస్ క్రీంలలో చాలా చక్కెర ఉంటుంది. టీ, కాఫీలలో కూడా చక్కెర కలుపుతారు. చక్కెర శరీరాన్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్, రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, గుండెపోటుకు ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి చక్కెర మొత్తాన్ని ఆహారంలో తగ్గించుకోవాలి. మనదేశంలో 99 శాతం మంది తమకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తింటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియం) కంటే ఎక్కువ తినకూడదు. కానీ జనాలు దీనికి రెండు రెట్లు ఎక్కువగా తింటారు. ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది. ఆ తరువాత ఇది గుండెపోటు, కడుపు క్యాన్సర్, ఊబకాయం, ఎముకల నష్టం (ఆస్టియోపోరోసిస్), మూత్రపిండాల నష్టానికి దారితీస్తుంది.
మార్కెట్లో లభించే ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం పామాయిల్‌లో వేయించినవి ఉంటాయి. ఇది చౌకగా, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి హైడ్రోజనేటెడ్ చేస్తారు. 2009లో NCBI చేసిన అధ్యయనంలో ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదం ఎన్నో రెట్లు పెరుగుతుందని వెల్లడైంది. అందువల్ల బయటి ఆహారాలు తినకూడదు. గుండెపోటు గురించి చర్చించే సమయంలో మద్యం గురించి ప్రస్తావించకుండా ఉండటం అసాధ్యం. ప్రతిరోజూ మద్యం తాగడం శరీరానికి హానికరం. మద్యపాన వ్యసనం గుండెకు చాలా ప్రమాదకరం. అధికంగా మద్యం తాగడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు మద్యం అలవాటు ఆకస్మిక గుండెపోటుకు కారణం కావచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దాని వాస్తవాల గురించి మేము ఎటువంటి నిర్ధారణ చేయడం లేదు. ఇతర వివరాలకు వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








