Pawan Kalyan: వస్తున్నా నిరంజన్.. అభిమాని కోరిక తీర్చేందుకు ఓరుగల్లుకు పవన్ కళ్యాణ్..
పవన్ కల్యాణ్ ఈరోజు ఓరుగల్లులో పర్యటించనున్నారు. హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్, అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధి అయిన Duchenne Muscular Dystrophyతో బాధపడుతున్నాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ కోరిక మేరకు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో, అతని కుటుంబ సభ్యులతో గడపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఓరుగల్లుకు రాబోతున్నారు.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ను పరామర్శించడానికి వస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తున్న ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కళ్యాణ్ గడుపుతారు.. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గాలి బుడగ లాంటి జీవితం.. ఆ జీవి ఎప్పుడు అనంత వాయువుల్లో కలిసిపోతుందో తెలియదు.. కానీ బ్రతికిన కొంతకాలమైనా తన కోరికలు నెరవేరాలని తపన… నిత్యం పవన్ కళ్యాణ్ జపంచేస్తూ స్థానికంగా చోటా గబ్బర్ సింగ్ అని పేరుపొందిన ఆ బాలుడి కోరిక నెరవేరబోతుంది.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఆ బాలుడిని ఇంటికి వస్తున్నారు.
హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము – మానస దంపతుల కుమారుడు నిరంజన్ గత మూడేళ్ల నుండి జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో అవస్థలు పడుతున్నాడు.. “డ్యూచెన్ మాస్కులర్ డిస్టోపీ” అనే వ్యాధితో రోజురోజుకు అతని జీవితం క్షీణిస్తోంది. 17 ఏళ్ల వయస్సులో మూడేళ్ల బాలుడిలా మారి నరకం అనుభవిస్తూ.. మంచానికి పరిమితమైన ఆ బాలుడి కోరికను పవన్ తీర్చనున్నారు. అతను పవన్ కల్యాణ్ అభిమాని..
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయం జనసేన నేతలు, సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది. ఈ నేపధ్యంలో ఆయన వెంటనే స్పందించారు.. నిరంజన్ కోరిక తీర్చి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తుండంతో.. ఆ బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పవన్ పలకరింపే ఆ బాలుడికి ఆయుస్సు నింపే సంజీవిని అవుతుందని భావిస్తున్నారు..
వీడియో చూడండి..
ఉదయం 7: 30 ని.లకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో వరంగల్ కు బయలు దేరుతారు.. ఉదయం 9:45 ని.లకు హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చేరుకుంటారు..9:45 ని.ల నుండి 10: 30 వరకు బాలుడు నిరంజన్ ను పరామర్శిస్తారు.. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు వెళ్తారు.. 45 నిమిషాల పాటు బాలుడు నిరంజన్ తో సహా ఆ కుటుంబంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదు అంటున్న జనసేన శ్రేణులు.. కేవలం ఆ బాలుడి కోరిక తీర్చడం కోసమే వస్తున్నారని తెలిపారు.
