AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్ అంటే ఇది.. ఇకపై రెండు గంటల్లోనే హైదరాబాద్‌ – విజయవాడ.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన..

ఏపీలోని నేషనల్‌ హైవేస్‌కి మహార్దశ రాబోతోంది. రోడ్ల అభివృద్ధిపై కూటమి సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ వ్యాప్తంగా 5వేల కోట్ల విలువైన రోడ్లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం రికార్డ్‌ సృష్టిస్తోంది. విజన్‌తోనే అభివృద్ధి అంటూ నితిన్‌ గడ్కరీ, సీఎం చంద్రబాబు.. ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడం ఆసక్తిగా మారింది.

గుడ్ న్యూస్ అంటే ఇది.. ఇకపై రెండు గంటల్లోనే హైదరాబాద్‌ - విజయవాడ.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన..
Hyderabad-Vijayawada Highway
Shaik Madar Saheb
|

Updated on: Aug 03, 2025 | 8:53 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో 5వేల 233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు మంగళగిరి వేదికగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా.. ఏపీకి కీలక హామీలు ఇచ్చారు నితిన్‌ గడ్కరీ. హైదరాబాద్‌-విజయవాడకు రెండు గంటల్లో వెళ్లేలా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే డీపీఆర్‌కి గడ్కరీ ఆదేశించారు. మరోవైపు.. వచ్చే రెండేళ్లలో ఏపీ రోడ్లు అమెరికా రోడ్లలా మెరిసిపోతాయన్నారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రెండు గంటల్లోనే చేరుకోవచ్చని గడ్కరీ తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఇప్పుడున్న రహదారిని ఆరు లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయని.. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందంటూ పేర్కొన్నారు. చంద్రబాబు విజన్‌తో ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని.. ఆయనెప్పుడూ ఫ్యూచర్‌ గురించే ఆలోచిస్తారన్నారు నితిన్‌ గడ్కరీ..

ఈ సందర్భంగా ఏపీలో చేపట్టబోయే భారీ ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ప్రకటించారు. రూ.6,700 కోట్లతో హైదరాబాద్‌- విజయవాడ రోడ్డు 6 లైన్లు, విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా ఆరు లైన్ల రోడ్డు – రూ.2600 కోట్లు, రూ. రెండు వేల కోట్లతో వినుకొండ నుంచి గుంటూరు రోడ్డు విస్తరణ, గుంటూరు నారాకోడూరు రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ, ఆకివీడు నుంచి దిగమర్రుకి కొత్త రహదారి, పెడన నుంచి లక్ష్మీపురం రహదారికి భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఇక.. దేశంలోని ప్రధాన హైవేలన్నీ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు అయ్యాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన వల్లే దేశంలోని రోడ్లు బాగున్నాయని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే ఆనాడు కూటమి ఏర్పాటుకు కృషి చేశామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్. కూటమిని ఏకం చేసిన తన ప్రయత్నం ఫలితాన్నిస్తుందని చెప్పారు.

మొత్తంగా.. దేశ ప్రగతిలో నీరు, విద్యుత్‌, రవాణా, కమ్యూనికేషన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తాయని నితిన్‌ గడ్కరీ చెప్పుకు రాగా.. ఆయన వల్లే దేశంలోని రోడ్లు మెరిసి పోతున్నాయని చంద్రబాబు ప్రశంసించారు. అటు.. ఏపీలో ఇంకో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు పవన్‌కళ్యాణ్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..