ఈశాన్యంలో రాజుకుంటున్న అగ్గి… బ్రూ తెగల ఎంట్రీతో త్రిపురలో ఫైర్

ప్రశాంతంగా ఉన్న ఈశాన్యంలో చిచ్చురాజుకుంది. త్రిపుర,మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణలకు దారితీసింది. మిజోరంకు చెందిన బ్రూ తెగల ప్రజలకు త్రిపురలో ఆశ్రయం కల్పించడంపై స్థానికులు భగ్గుమన్నారు..

  • Sanjay Kasula
  • Publish Date - 8:00 pm, Sat, 21 November 20
ఈశాన్యంలో రాజుకుంటున్న అగ్గి... బ్రూ తెగల ఎంట్రీతో త్రిపురలో ఫైర్

Locals protest : ప్రశాంతంగా ఉన్న ఈశాన్యంలో చిచ్చురాజుకుంది. త్రిపుర,మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణలకు దారితీసింది. మిజోరంకు చెందిన బ్రూ తెగల ప్రజలకు త్రిపురలో ఆశ్రయం కల్పించడంపై స్థానికులు భగ్గుమన్నారు జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్భందించారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు చనిపోగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులు ఆందోళనకారుల పైకి భాష్పవాయువును కూడా ప్రయోగించారు. అయినప్పటికి పరిస్థితి అదుపు లోకి రాలేదు.

త్రిపుర రాష్ట్రంలో బ్రూ తెగ ప్ర‌జ‌లు ప‌ర్మ‌నెంట్‌గా సెటిల్ కావాల‌న్న ఒప్పందం 20 ఏళ్ల క్రిత‌మే జ‌రిగింది. సుమారు 30 వేల మంది దీని ద్వారా శ‌ర‌ణార్థులుగా మార‌నున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సార్లు సెటిల‌య్యే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. త్రిపుర‌, మిజోరం, అస్సాం రాష్ట్రాల్లో కూడా బ్రూ తెగ ప్ర‌జ‌లు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం త్రిపుర‌లో నివ‌సిస్తున్నారు. బ్రూ తెగ శ‌ర‌ణార్థుల‌ను.. రియాంగ్స్ అని కూడా పిలుస్తుంటారు. వీరికి మీజోస్‌తో తేడా ఉంటుంది. రియాంగ్స్ తెగ వారు మాట్లాడే బాష కూడా వేరుగా ఉంటుంది. త్రిపుర‌లో ఉన్న 21 షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో ఈ తెగవారు కూడా ఒకరు.

మిజోరంలొ సుమారు 40 వేల బ్రూ తెగ ప్ర‌జ‌లు ఉన్నారు. త్రిపుర‌లో ఆ సంఖ్య 32 వేలు ఉంటుంద‌ని ప్రభుత్వ లెక్కలు. అయితే.. మిజోరం నుంచి 40 వేల మందిని తమ రాష్ట్రానికి తరలిస్తే సహించే ప్రసక్తే లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తరలించేవారకు తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.