Telangana: ఆటగదరా శివ.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. వేసవి సెలవుల నేపథ్యంలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

కామారెడ్డి జిల్లా : సరదాగా ఇతకొట్టేందుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన అనిత, శ్రీవాణి, పావని, భాను ప్రసాద్ అనే నలుగురు చిన్నారులు కలిసి పిట్లం మండలం బొల్లాక్‌పల్లి సమీపంలోని మంజీరా నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. నదిలోకి దిగి ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో వారు ప్రాణాలతో బయటకు రాలేకపోయారు.
నీటిలో మునిగిపోతున్న చిన్నారుల కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నలుగురిలో ముగ్గురు చిన్నారులు ఊపిరాడక నీటిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద అంచుల్లో ఉన్న భాను ప్రసాద్ అనే మరో చిన్నారిని స్థానికులు రక్షించి, వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
