Telangana: ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. మీకు నచ్చిన చోటే 400 చదరపు అడుగుల విశాలమైన ఇళ్లు!
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఆసరాగా నిలుస్తూ.. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఒక అద్భుతమైన గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం పేదలు, అల్పాదాయ (LIG), మధ్యతరగతి (MIG) కుటుంబాలకు పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇళ్లతో పాటు ఆ స్థలాల్లో వాటా కల్పించి లబ్ధిదారులను యజమానులుగా తీర్చిదిద్దే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
ఈ గృహాల యాజమాన్యంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పేద కుటుంబాల మహిళల పేరుతో హక్కులు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. మొత్తం 3.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులు, ఉపాధి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని మంత్రి విమర్శించారు. రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలపై ఆధారపడే కుటుంబాలు ఆ ప్రాంతాలకు వెళ్లలేకపోయాయని, ఉపాధి అవకాశాలు దూరమవడంతో పాటు పిల్లల చదువు, వైద్యం, రవాణా సమస్యలు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.
దీని ఫలితంగా అనేక గృహాలు ఖాళీగా మిగిలిపోయాయని, గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయబోమని మంత్రి స్పష్టం చేశారు. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించేలా కొత్త గృహ నిర్మాణ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, సౌకర్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్లు నిర్మించేలా డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన నివాసాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి.
