అడ్మిషన్ సమయంలో కాలేజీలకు ఒరిజనల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలా..? తెలుసుకోండి..
కళాశాల అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించమని అడగడం సర్వసాధారణం. అయితే, కోర్సు పూర్తయ్యే వరకు వాటిని తిరిగి ఇవ్వమని కళాశాలలు చెప్పడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లను కళాశాల నిలిపివేస్తే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం ..

కాలేజీల్లో అడ్మిషన్ పొందే సమయంలో యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోరడం సాధారణ ప్రక్రియ. పదో తరగతి మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) వంటి ఒరిజినల్ పత్రాలను ధృవీకరణ కోసం సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కాలేజీలు కోర్సు పూర్తయ్యే వరకు ఈ ఒరిజినల్ పత్రాలను తమ వద్దే ఉంచుకుంటామని చెబుతుంటాయి. ఇలా ఉంచుకుని.. ఫీజు రియంబర్స్‌మెంట్ లేటయినా.. రాకపోయినా.. ఆ డబ్బు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటారు. ఈ విధానం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు విరుద్ధం.
యూజీసీ నిబంధనల ప్రకారం, అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కేవలం పరిశీలించి, వాటి నిజానిజాలను నిర్ధారించిన వెంటనే విద్యార్థికి తిరిగి ఇవ్వాలి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలలు తమ వద్ద నిలిపివేసే హక్కు వారికి లేదు. కొంతమంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల లేదా మెరుగైన అవకాశాలు లభించడంతో వేరే కళాశాలకు మారాలని నిర్ణయించుకుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తూ, మొత్తం కోర్సు ఫీజు లేదా మిగిలిన సంవత్సరాల ఫీజును చెల్లించాలని షరతులు విధిస్తుంటాయి. ఫీజులకు సంబంధించిన వివాదం ఉంటే దానిని చట్టపరంగా పరిష్కరించుకోవాలి కానీ, విద్యార్థుల ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను బందీగా ఉంచడం నిబంధనలకు విరుద్ధం.
ఇలాంటి పరిస్థితి ఎదురైతే విద్యార్థులు ముందుగా కళాశాల ప్రిన్సిపల్ లేదా యాజమాన్యానికి లిఖితపూర్వకంగా తమ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే, సంబంధిత అనుబంధ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లేదా వైస్-ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు చెల్లుబాటు అయ్యేది అయితే, వైస్-ఛాన్సలర్ ఆ కళాశాలపై తగిన చర్యలు తీసుకుని, మీ సర్టిఫికెట్స్ మీకు తిరిగి అందేలా చూస్తారు. అలాగే యూజీసీ ఫిర్యాదు వ్యవస్థలో కూడా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత నియంత్రణ సంస్థలను లేదా న్యాయపరమైన మార్గాన్ని కూడా ఆశ్రయించవచ్చు.
అడ్మిషన్ సమయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఒరిజినల్ ధృవీకరణ పత్రాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యూజీసీ నిబంధనలపై అవగాహన ఉంటే, తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు అనవసర ఇబ్బందులను కూడా నివారించవచ్చు. అడ్మిషన్ సమయంలో మీ వ్యక్తిగత సమాచారం, ఒరిజినల్ డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
