AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

మేడ్ ఇన్ ఆంధ్రా బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు నిల్వలను కనుగొన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి మైన్ నుంచి బంగారాన్ని వెలికితీశారు. వీటిని శుద్ది చేసి బంగారు బిస్కెట్లుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ బంగారంపై ఏపీ లోగో ముద్రించారు

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. మేడ్ ఇన్ ఆంధ్రా పేరుతో మార్కెట్లోకి..
Gold
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 11:02 AM

Share

బంగారం… ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు… బంగారు బిస్కెట్లు… విదేశాల నుంచి దిగుమతి అయ్యే బులియన్. కానీ ఇకపై “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” బంగారం కూడా మార్కెట్లోకి వచ్చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో వెలికితీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి తొలి బంగారు బిస్కెట్లుగా మార్చడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. జొన్నగిరి గనుల నుంచి వెలికితీసిన బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత… 100 గ్రాములు, 500 గ్రాముల బరువుతో తొలి బంగారు బిస్కెట్లు తయారయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉందని తెలుసు… కానీ ఇక్కడే తవ్వి… ఇక్కడే శుద్ధి చేసి… మార్కెట్‌కు సిద్ధం చేసిన బంగారం చూడటం ఇదే తొలిసారి. ఇది కేవలం ఒక పరిశ్రమ విజయం మాత్రమే కాదు… రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ప్రతీక.

మేడ్ ఇన్ ఆంధ్రా

సాధారణంగా మనం కొనే బంగారం ఎక్కడి నుంచి వస్తుందో పెద్దగా ఆలోచించం. కానీ ఇకపై ఆంధ్రప్రదేశ్ నేలలో పుట్టిన బంగారం కూడా ఆ జాబితాలో చేరుతోంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర ఖనిజ సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు అవకాశంగా కనిపించిన గని… ఇప్పుడు వాస్తవంగా బంగారం అందిస్తోంది. జొన్నగిరి ప్రాజెక్టు వెనుక ఎన్నో ఏళ్ల అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలు, భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత ఉన్నాయి. భూమిలోని ఖనిజాన్ని వెలికితీయడం నుంచి శుద్ధి చేసి బంగారు బిస్కెట్‌గా మార్చే వరకు ప్రతి దశ అత్యంత కచ్చితత్వంతో సాగుతుంది. ఆ ప్రక్రియ ఫలితమే ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి ఏపీ బంగారం.

రాష్ట్ర భవిష్యత్‌పై కొత్త ఆశలు

ఈ బంగారం విలువ కేవలం దాని ధరలోనే లేదు. వేల మందికి ఉపాధి, స్థానిక ప్రాంతాల అభివృద్ధి, రవాణా, అనుబంధ పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వానికి రాయల్టీలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం లాంటి అనేక రూపాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది బలం చేకూర్చనుంది. ఒక గని చుట్టూ కొత్త ఆర్థిక చైతన్యం కనిపించబోతోంది ఇప్పటి వరకు “ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, సముద్ర సంపద” అనే గుర్తింపు ఉండేది. ఇకపై “బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం” అనే మరో ప్రత్యేకత కూడా చేరబోతోంది. జొన్నగిరి నుంచి వచ్చిన ఈ తొలి బంగారు బిస్కెట్లు… కేవలం బంగారు ముక్కలు కాదు… రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలు… కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

Follow Us