AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో వీడు నరభక్షకుడా..? ఆస్పత్రి ఉద్యోగి ఇంట్లో మనుషుల గుండెలు, మెదడ్లు స్టాక్..!

హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక భయంకరమైన నరమాంస భక్షకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి, పాడుబడిన శ్మశానవాటికల నుండి మనుషుల శరీర భాగాలను దొంగిలించి, తన అపార్ట్‌మెంట్‌లో దాచుకోవడమే కాకుండా, వాటిలో కొన్నింటిని వండుకుని తిన్నట్లు అంగీకరించిన ఒక 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగిని హంగేరియన్ పోలీసులు అరెస్టు చేశారు.

వామ్మో వీడు నరభక్షకుడా..? ఆస్పత్రి ఉద్యోగి ఇంట్లో మనుషుల గుండెలు, మెదడ్లు స్టాక్..!
Hungary Hannibal Arrest
Balaraju Goud
|

Updated on: Jun 27, 2026 | 1:33 PM

Share

హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక భయంకరమైన నరమాంస భక్షకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి, పాడుబడిన శ్మశానవాటికల నుండి మనుషుల శరీర భాగాలను దొంగిలించి, తన అపార్ట్‌మెంట్‌లో దాచుకోవడమే కాకుండా, వాటిలో కొన్నింటిని వండుకుని తిన్నట్లు అంగీకరించిన ఒక 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగిని హంగేరియన్ పోలీసులు అరెస్టు చేశారు.

బుడాపెస్ట్‌లోని ఒక ఆసుపత్రిలో రోగులను రవాణా చేసే వ్యక్తిగా పనిచేస్తున్న నిందితుడిపై అనుమానంతో హంగేరీ జాతీయ దర్యాప్తు సంస్థ అతని అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో దర్యాప్తు అధికారులకే ఒళ్లు గగుర్పొడిచేలా భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. పోలీసులు నిందితుడి ఇల్లు, సూట్‌కేసుల నుండి క్రింది శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మానవ ముఖం, వలిచిన ముఖ చర్మం, ఒక కాలు కింది భాగం, ఒక చేయి, ఒక మానవ మెదడు దొరికాయి. వీటితోపాటు అనేక పుర్రెలు, ఒక సూట్‌కేసు నిండా ప్యాక్ చేసిన ఎముకలు లభించాయి. ఒక జాడీలో భద్రపరిచిన గుండెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మనిషివా లేక జంతువువా అని తేల్చడానికి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

విచారణలో నిందితుడు తన నేరాలను అంగీకరిస్తూ.. తనకు మానవ శరీర నిర్మాణ శాస్త్రం, వ్యాధి శాస్త్రంపై అమితమైన ఆసక్తి ఉందని చెప్పాడు. చిన్నప్పటి నుంచే జంతువులను విచ్ఛేదనం చేయడం అతనికి అలవాటని, ఆ వికృత అభిరుచితోనే కొన్ని శరీర భాగాలను వండుకుని తిన్నానని దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. అంతేకాకుండా, ఈ ఎముకల సేకరణ గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో బహిరంగంగా చర్చించడమే కాక, వాటిని ఫోటోలు కూడా తీసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ అవశేషాలన్నీ నిందితుడు పనిచేస్తున్న ఆసుపత్రి నుంచే కాకుండా, హంగేరి, పొరుగు దేశమైన స్లోవేకియాలోని పాడుబడిన శ్మశానవాటికల నుండి సమాధులు తవ్వి దొంగిలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఈ అవశేషాలు ఎవరివో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, శ్మశానాల తవ్వకాలపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత నిందితుడిపై మరిన్ని కఠినమైన అదనపు అభియోగాలు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us