రెండు కాళ్లపై నిలబడి ఫేమస్.. 23 ఏళ్లకి గిన్నిస్ రికార్డు.. ఈ రెడ్ పాండా కథే వేరు!
Red Panda Futa: ఒకప్పుడు రెండు కాళ్లపై నిటారుగా నిలబడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ వింత అలవాటుతో జపాన్‌లో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. చివరకు ప్రకటనల్లోనూ నటించేంత పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు అదే రెడ్ పాండా మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఏకంగా 23 ఏళ్ల వయసులో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. సాధారణంగా 12 నుంచి 17 ఏళ్లు మాత్రమే జీవించే రెడ్ పాండా ఇంతకాలం బతికి ఉండటం విశేషం. ఇంతకీ ఈ బుజ్జి జంతువు కథేంటో తెలుసుకుందాం.

జపాన్‌కు చెందిన ఫుటా అనే రెడ్ పాండా అందరి మనసులు గెలుచుకుంది. ఒకప్పుడు రెండు కాళ్లపై మనిషిలా నిలబడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బుజ్జి జంతువు.. ఇప్పుడు తన వయసుతో సరికొత్త రికార్డు సృష్టించింది.
23 ఏళ్ల వయసు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు!
జపాన్‌లోని చిబా జూలాజికల్ పార్క్‌లో నివసిస్తున్న ఫుటాకు నవంబర్ 17న అరుదైన గుర్తింపు లభించింది. బందిఖానాలో జీవిస్తున్న రెడ్ పాండాల్లో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న జీవించి ఉన్న రెడ్ పాండాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. గుర్తింపు ఇచ్చిన రోజున ఫుటా వయసు 23 ఏళ్ల 135 రోజులు. సాధారణంగా రెడ్ పాండాలు 12 నుంచి 17 ఏళ్ల వరకు మాత్రమే జీవిస్తాయి. కానీ ఫుటా మాత్రం ఆ వయోపరిమితిని దాటి 23 ఏళ్లకు చేరుకుంది. దీంతో ఈ అరుదైన ఘనతను గుర్తిస్తూ గిన్నిస్ ప్రతినిధులు జూలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ వేడుకకు అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
2003 జూలై 5న జపాన్‌లోని షిజుఒకా మున్సిపల్ నిహొండైరా జూలో జన్మించిన ఫుటాకు తండ్రి ఫుఫు పేరు ఆధారంగా పేరు పెట్టారు. 2004లో చిబా జూలాజికల్ పార్క్‌కు తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన ఏడాది తర్వాత అంటే 2005లో ఫుటా చేసిన ఓ పని జపాన్ ప్రజలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా రెడ్ పాండాలు నాలుగు కాళ్లపై నడుస్తుంటాయి. కానీ ఫుటా మాత్రం తన రెండు వెనుక కాళ్లపై నిటారుగా నిలబడేది. అచ్చం మనిషిలా నిలబడుతున్న దాని ఫొటోలు, వీడియోలు అప్పట్లో జపాన్ అంతటా వైరల్ అయ్యాయి. దీంతో ఫుటాను చూసేందుకు జనం జూకు క్యూ కట్టారు. అప్పట్లో సందర్శకుల సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న చిబా జూకు ఫుటా కొత్త కళ తీసుకొచ్చింది. దాని పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే.. చివరకు ఓ క్యాన్డ్ డ్రింక్ ప్రకటనలో నటించే అవకాశం కూడా దక్కింది.
చూపు మందగించింది.. అయినా ఆరోగ్యంగానే!
ఒకప్పుడు రెండు కాళ్లపై నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచిన ఫుటా ఇప్పుడు వయసు మీద పడటంతో గతంలోలా నిలబడలేకపోతోంది. చూపు కూడా కొంత మందగించింది. అయితే అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఫుటా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మంచి ఆకలితో ఆహారం తీసుకుంటోందని జూ అధికారులు తెలిపారు. ఫుటా తన సంతానం ద్వారా రెడ్ పాండాల సంఖ్య పెరగడానికి కూడా తోడ్పడింది.
గిన్నిస్ వేడుకకు రాలేకపోయిన ఫుటా!
ఫుటాకు గిన్నిస్ రికార్డు వచ్చిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కొందరు అభిమానులు రెడ్ పాండా చెవుల్లాంటి హెడ్‌బ్యాండ్లు ధరించి వేడుకకు వచ్చారు. అయితే ఫుటా మాత్రం అక్కడ కనిపించలేదు. నవంబర్ 17న వాతావరణం చల్లగా ఉంటుందన్న అంచనాతో జూ అధికారులు సందర్శకులకు ఫుటాను బయటకు తీసుకురాలేదు. దీంతో ఫుటా తరఫున సంరక్షకుడు యాసుషి ఇటో గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఫుటా ఫొటోతో పాటు గిన్నిస్ సర్టిఫికెట్‌ను జూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆరోగ్యం బాగానే ఉందని, ఆహారం కూడా బాగా తీసుకుంటోందని అభిమానులకు తెలిపింది.
24 ఏళ్లు బతికిన కుసు పేరిట మరో రికార్డు!
ఫుటాకు ముందు బతికున్న రెడ్ పాండాల్లో బందిఖానాలో అత్యధిక వయసు రికార్డు అమెరికాలోని జూమోంటానా జూలో నివసించిన టేలర్ పేరిట ఉండేది. అది 21 ఏళ్ల 265 రోజుల పాటు జీవించింది. ఇప్పుడు 23 ఏళ్ల 135 రోజుల వయసున్న ఫుటా ఆ రికార్డును అధిగమించింది. అయితే బందిఖానాలో ఇప్పటివరకు జీవించిన అత్యంత పెద్ద వయసున్న రెడ్ పాండా రికార్డు మాత్రం కుసు పేరిట ఉంది. జపాన్‌లోని ఇటోజు నో మోరి జూలో నివసించిన కుసు 2015లో మరణించే సమయానికి దాని వయసు 24 ఏళ్లు.
అంతరించిపోయే ప్రమాదంలో రెడ్ పాండాలు!
మరోవైపు రెడ్ పాండాల మనుగడ ఆందోళనకరంగా మారింది. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (IUCN) వీటిని అంతరించిపోయే జాతిగా గుర్తించింది. తూర్పు హిమాలయాలు, నైరుతి చైనాలోని పర్వత ప్రాంత అడవులు వీటి సహజ నివాసాలు. అడవులు నశించడం వంటి కారణాలతో వీటి సంఖ్య తగ్గుతోంది. పుటాకు వయసు పెరిగినా అభిమానుల ప్రేమ తగ్గలేదు. ఫుటా పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది!