Diabetes Risk: రోజంతా రోడ్లపై తిరిగే వారు జాగ్రత్త.. షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ మీకే ఎక్కువట!
వాహనాల రణగొణ ధ్వనులు, రైళ్ల శబ్దాలు నిత్యం వినిపిస్తుంటే పెద్దగా పట్టించుకోరు. ట్రాఫిక్‌లో హారన్లు, ఇంజిన్ల శబ్దాలు సాధారణమే కదా అని అనుకుంటారు. కానీ ఇలాంటి శబ్దాల మధ్య ఎక్కువకాలం జీవించడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదంతో ట్రాఫిక్ శబ్దాలకు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తక్కువ స్థాయి శబ్దం కూడా ఈ ప్రమాదంతో ముడిపడి ఉండటం గమనార్హం.

స్వీడన్, డెన్మార్క్‌కు చెందిన లక్షలాది మంది కాకుండా 1.42 లక్షలకు పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. రోడ్డు ట్రాఫిక్, రైళ్ల శబ్దాలతో పాటు విమానాల శబ్దాల ప్రభావాన్ని కూడా పరిశీలించారు. మరి వాహనాల శబ్దం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎంత పెరుగుతుంది? ఎవరికి ఎక్కువ ముప్పు ఉంటుంది? ఈ అధ్యయనంలో బయటపడిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1. 1.42 లక్షల మందిపై పరిశోధన.. 20 ఏళ్లకు పైగా పరిశీలన
స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు డెన్మార్క్, స్వీడన్లలో నిర్వహించిన ఎనిమిది జనాభా అధ్యయనాల నుంచి 1,42,000 మందికి పైగా వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించారు. వారి నివాస ప్రాంతాల్లో రోడ్డు ట్రాఫిక్, రైల్వేలు, విమానాల వల్ల వచ్చే శబ్ద స్థాయిలను అంచనా వేశారు. సుమారు 20 ఏళ్లకు పైగా వారిని పరిశీలించారు. ఈ సమయంలో 12,761 మందికి టైప్-2 మధుమేహం వచ్చినట్లు గుర్తించారు.
ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. రోడ్డు ట్రాఫిక్ శబ్దం ప్రతి 10 డెసిబెల్స్ పెరిగినప్పుడు టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం సుమారు 6 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. రైళ్ల శబ్దం విషయంలో ఈ ప్రమాదం 4 శాతంగా ఉంది. ముఖ్యంగా 50 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్ద స్థాయుల్లో కూడా ఈ సంబంధం కనిపించడం గమనార్హం. అంటే పెద్దగా శబ్దం వినిపించకపోయినా నిరంతరం ట్రాఫిక్ శబ్దాల మధ్య ఉండటం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
3. అధిక బరువు ఉన్నవారికి మరింత ప్రమాదం!
ట్రాఫిక్ శబ్దాల ప్రభావం అందరిలో ఒకేలా కనిపించలేదు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో రోడ్డు ట్రాఫిక్ శబ్దానికి, మధుమేహం ప్రమాదానికి మధ్య బలమైన సంబంధం కనిపించింది. ప్రతి 10 డెసిబెల్స్ శబ్దం పెరిగినప్పుడు ఈ వర్గంలో మధుమేహం వచ్చే ప్రమాదం 7 శాతం పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. సాధారణ బరువు ఉన్నవారిలో మాత్రం ఇలాంటి పెరుగుదల కనిపించలేదు.
4. వాయు కాలుష్యం కూడా తోడైతే ముప్పు ఎక్కువే!
ట్రాఫిక్ శబ్దాలతో పాటు వాయు కాలుష్యం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా PM2.5 అనే అతి సూక్ష్మ కాలుష్య కణాలకు ఎక్కువగా గురైన వారిలో ట్రాఫిక్ శబ్దాల ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. అధిక PM2.5 కాలుష్యానికి గురైన వారిలో ప్రతి 10 డెసిబెల్స్ రోడ్డు శబ్దం పెరిగినప్పుడు మధుమేహం ప్రమాదం 14 శాతం పెరిగినట్లు అంచనా వేశారు. అందువల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యాన్ని కలిపి పరిశీలించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.
5. ట్రాఫిక్ శబ్దం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది?
నిరంతరం పెద్ద శబ్దాలు వినిపించడం వల్ల నిద్రకు ఆటంకం కలగవచ్చు. అలాగే శరీరంలోని ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థ చురుకుగా మారవచ్చు. దీనివల్ల ఒత్తిడి హార్మోన్లలో మార్పులు వచ్చి శరీర జీవక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మార్పులు దీర్ఘకాలంలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదానికి దోహదపడవచ్చని చెబుతున్నారు. అయితే ఇది ఈ అధ్యయనంలో నిరూపితమైన కారణం కాదు. పరిశోధకులు సూచించిన సాధ్యమైన వివరణ మాత్రమే.
6. విమానాల శబ్దంతోనూ మధుమేహం వస్తుందా?
ఈ పరిశోధనలో రోడ్డు ట్రాఫిక్, రైళ్ల శబ్దాలతో మధుమేహం ప్రమాదానికి సంబంధం కనిపించినప్పటికీ విమానాల శబ్దంతో స్పష్టమైన సంబంధం కనిపించలేదు. అయితే విమానాల శబ్దాలకు గురైన వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ ఫలితాలపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
