Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్ కట్‌చేస్తే.. కాసేపటికే
ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కేటుగాడు ఏకంగా పోలీస్ అధికారినంటూ చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త ఎత్తుగడలతో సామాన్యులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా పోలీస్ అధికారుల పేర్లను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే స్థానిక ఎస్ఐ పేరుతో ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి, ఓ యువకుడిని నమ్మించి రూ. 20 వేలు కాజేశాడు. టేక్మాల్ గ్రామానికి చెందిన సయ్యద్ ఆరిఫ్‌కు బుధవారం సాయంత్రం ఓ అజ్ఞాత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను టేక్మాల్ ఎస్ఐగా పరిచయం చేసుకున్నాడు. పోలీస్ అధికారి మాట్లాడుతున్నారనే భయంతో పాటు నమ్మకంతో ఆరిఫ్ అతడి మాటలను విశ్వసించాడు.
తనకు అత్యవసరంగా ఆన్‌లైన్‌లో డబ్బులు కావాలని, యూపీఐ ద్వారా బదిలీ చేస్తే తిరిగి నగదు రూపంలో చెల్లిస్తానని కేటుగాడు నమ్మబలికాడు. నిజంగానే ఎస్ఐ అడుగుతున్నారని భావించిన ఆరిఫ్, సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు వెంటనే రూ. 20 వేలు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశాడు. డబ్బులు అందిన వెంటనే అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆరిఫ్‌కు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు ఎస్ఐ ఎవరికీ ఫోన్ చేయలేదని తేలింది.
తాను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయానని గ్రహించిన బాధితుడు, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయడంతో పాటు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.మరో వైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా తెలిసిన వ్యక్తుల పేర్లు, ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రతగ్గా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
