AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డు మంచి ప్రోటీన్ ఆహారం. అయితే ఉడికించిన గుడ్డు తినాలా? ఆమ్లెట్ వేసుకుని తినాలా? ఈ రెండింటిలో కేలరీలు, పోషకాలు ఎలా ఉంటాయి? నూనె వినియోగం బరువుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బరువు తగ్గే డైట్‌లో ఏది ఎంచుకోవాలో పోషకాహార నిపుణుల సూచనలతో తెలుసుకుందాం.

ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Boiled Egg Vs Omelette
Shaik Madar Saheb
|

Updated on: Nov 21, 2026 | 3:57 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రతిరోజు ఒక గుడ్డు తినడం చాలా మంచిది. ఇది తక్కువ ఖర్చుతో లభించే పోషకాల గని.. అందుకే రోజూ ఒక గుడ్డు తినాలంటూ ఆరోగ్య నిపుణుల చెబుతుంటారు.. అయితే.. బరువు తగ్గాలనుకునే వారి రోజువారీ ఆహార ప్రణాళికలో గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభించే గుడ్డు ఆకలిని నియంత్రించడమే కాకుండా, శరీర జీవక్రియను మెరుగుపరిచి కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అయితే, డైట్ చేసే వారిలో చాలామందికి ఉడకబెట్టిన గుడ్డు (Boiled Egg) .. తినాలా లేక ఆమ్లెట్ (Omelette) తినాలా అనే సందేహం తరచూ ఎదురవుతుంటుంది. వండే విధానం, అదనపు కేలరీల ఆధారంగా ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.. అనే విషయాలపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

సాధారణంగా ఒక పెద్ద ఉడకబెట్టిన గుడ్డులో సుమారు 70 నుంచి 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల సహజ కొవ్వు మాత్రమే ఉంటాయి. దీనిని కేవలం నీటిలో ఉడకబెడతారు కాబట్టి నూనె, వెన్న వంటి అదనపు కొవ్వులు శరీరంలోకి చేరే అవకాశం ఉండదు. అంతేకాకుండా, ఉడకబెట్టినప్పుడు గుడ్డులోని విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు నష్టపోకుండా శరీరానికి సులభంగా అందుతాయి. ఉడకబెట్టిన గుడ్డు తిన్న తర్వాత ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలగడం వల్ల మధ్యమధ్యలో అనవసరపు చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది.

మరోవైపు, ఆమ్లెట్ విషయానికి వస్తే అందులోనూ ప్రోటీన్ సమానంగానే ఉన్నప్పటికీ, తయారీ విధానం వల్ల కేలరీలు గణనీయంగా పెరిగిపోతాయి. ఆమ్లెట్ వేయడానికి వాడే నూనె, వెన్న, నెయ్యి లేదా చీజ్ కారణంగా ఒక గుడ్డు ఆమ్లెట్‌లోని కేలరీలు 110 నుంచి 150 వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి. ఈ అదనపు కొవ్వులు బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. అయితే, ఆమ్లెట్ పూర్తిగా అనారోగ్యకరం కాదని నిపుణులు చెబుతున్నారు. నాన్‌స్టిక్ పాన్‌పై కేవలం కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వేసి, ఉల్లిపాయలు, పాలకూర, క్యాప్సికమ్, టమాటా వంటి కూరగాయ ముక్కలు కలిపి ఆమ్లెట్ వేసుకుంటే ఫైబర్ కూడా లభిస్తుంది.

మొత్తంగా పరిశీలిస్తే, వేగంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉడకబెట్టిన గుడ్డే మొదటి ఉత్తమ ఎంపిక. తక్కువ కేలరీలతో పూర్తిస్థాయి పోషకాలను అందించడంలో ఇది ముందుంటుంది. ఒకవేళ రోజూ ఉడకబెట్టిన గుడ్డు తిని బోర్ కొట్టి, రుచిలో మార్పు కావాలనుకుంటే మాత్రం తక్కువ నూనెతో కూరగాయలు కలిపిన ఆమ్లెట్‌ను అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలున్నా.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us