ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల చలికాలంలో కూడా ఎండలు బాగానే కాస్తున్నప్పటికీ, చాలా మందిలో విటమిన్ D లోపం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజంతా ఆఫీసుల్లో, ఏసీ గదుల్లో ఉంటూ ఎండ తగలకుండా పని చేసే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు, కండరాలు గట్టిగా ఉండటానికి, మన శరీరం రోగాలతో పోరాడే శక్తిని పొందటానికి విటమిన్ D చాలా అవసరం. విటమిన్ D లోపిస్తే ఎముకలు మెత్తబడటం, తరచూ నడుమునొప్పి, కీళ్లనొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా, ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, జుట్టు రాలడం, త్వరగా జలుబు చేయడం, మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మాంసాహారం తినేవారు సాల్మన్ చేప, బంగడ చేప, కోడిగుడ్ల పచ్చసొన వంటివి తీసుకోవాలి. శాకాహారులు ఎండలో పెరిగిన పుట్టగొడుగులు (మష్రూమ్స్), పన్నీర్, చీజ్, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్, విటమిన్ D కలిపిన పాలు, పెరుగు, ఓట్స్ లేదా సీరియల్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహార పదార్థాలు విటమిన్ D స్థాయిలను పెంచి, చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.