AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైప్-2 మధుమేహంతో జాగ్రత్త..! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మాత్రమే కాదు. దీర్ఘకాలంగా నియంత్రణలో లేని టైప్-2 మధుమేహం శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్లు, మూత్రపిండాలు, నరాలు, పాదాలు, గుండెతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

టైప్-2 మధుమేహంతో జాగ్రత్త..! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Type 2 Diabetes Warning Signs
Balaraju Goud
|

Updated on: Nov 21, 2026 | 2:57 PM

Share

మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మాత్రమే కాదు. దీర్ఘకాలంగా నియంత్రణలో లేని టైప్-2 మధుమేహం శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్లు, మూత్రపిండాలు, నరాలు, పాదాలు, గుండెతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ సమస్యల్లో చాలా వరకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతాయి. అందుకే రక్తంలో చక్కెర, HbA1c పరీక్షలతో పాటు ఇతర అవయవాల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముగ్గురు వైద్యుల కీలక సూచనలు

పూణేకు చెందిన కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సంజయ్ పి. గాంధీ, భోపాల్‌కు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ సచిన్ కె. గుప్తా, బెంగళూరులోని డయాకాన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఆర్. అరవింద్ మధుమేహ సమస్యలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. మధుమేహం శరీరంలోని పెద్ద రక్తనాళాల నుంచి అతి చిన్న రక్తనాళాల వరకు ప్రభావితం చేయగలదని, కొన్ని సమస్యలు వ్యాధి నిర్ధారణకు ముందే ప్రారంభమవుతాయని డాక్టర్ గాంధీ వివరించారు.

కళ్ల పరీక్షలు తప్పనిసరి!

దృష్టి స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లకు ఎలాంటి ప్రమాదం లేదని భావించకూడదు. మధుమేహం వల్ల డయాబెటిక్ రెటినోపతి ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా చూపును దెబ్బతీయవచ్చు. అందుకే టైప్-2 మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే ఫండస్ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా, సాధారణంగా ఏటా ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. చూపు మసకబారడం, తగ్గడం, కంటినొప్పి, ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

క్రియాటినిన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించలేం. కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి eGFR పరీక్ష, మూత్రంలో ఆల్బుమిన్ లీకేజీని గుర్తించడానికి UACR పరీక్ష చేయించుకోవాలి. కనీసం ఏటా ఒకసారి ఈ పరీక్షలతో పర్యవేక్షణ అవసరం.

పాదాల్లో తిమ్మిరి ఉంటే అప్రమత్తం

పాదాల్లో మంట, జలదరింపు, తిమ్మిరి లేదా నొప్పి డయాబెటిక్ న్యూరోపతి సంకేతాలు కావచ్చు. అధిక రక్త చక్కెర నరాలను దెబ్బతీయడం వల్ల ఈ సమస్య వస్తుంది. పాదాలపై చిన్న గాయాలు, బొబ్బలు, కోతలు ఉన్నాయేమో ప్రతిరోజూ పరిశీలించాలి. గాయాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

నివారణకు ఏం చేయాలి?

రక్తంలో చక్కెర, HbA1c స్థాయిలను వైద్యుల సూచన మేరకు నియంత్రణలో ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

మొత్తంగా మధుమేహ నియంత్రణ అంటే కేవలం షుగర్ రీడింగ్ తగ్గించడం కాదు. శరీరంలోని ప్రతి అవయవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా. లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడమే తీవ్రమైన సమస్యలను నివారించడానికి కీలకం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us