AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!

NIA Investigation: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇతర పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఇది కేవలం ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన ఘర్షణేనా? లేక విమానాన్ని హైజాక్ చేయడం లేదా కూల్చివేయడం వంటి పెద్ద కుట్ర ఇందులో దాగి ఉందా? ఇప్పుడు ఎన్ఐఏ ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ఈ వ్యవహారంలో భారతీయుల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!
Nia Investigates Possible Indian Links In Flydubai Pilot Stabbing Case
Sharada V
|

Updated on: Nov 21, 2026 | 10:33 AM

Share

NIA Investigation: వందలాది మంది ప్రయాణికులతో గాల్లో దూసుకెళ్తున్న విమానం.. అంతలోనే కెప్టెన్‌పై సహ పైలట్ కత్తితో దాడి! ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? నిందితుడికి భారత్‌లో సంబంధాలున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూనే దర్యాప్తు సాగుతోంది. ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఈ భయానక ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారతీయ లింకులపై ఆరా తీస్తోంది. కీలక సమాచారం కోసం యూఏఈ ప్రభుత్వ సహకారాన్ని కోరింది.

నిందితుడి స్నేహితులపై ఎన్ఐఏ నిఘా!

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఒమన్ కో-పైలట్‌కు భారత్‌లో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అతడి స్నేహితుల వర్గంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ దాడికి ముందు లేదా తర్వాత ఎవరితోనైనా సంప్రదింపులు జరిపాడా? అనే అంశాలను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. నిందితుడి పరిచయాలు, స్నేహితుల నెట్‌వర్క్‌లో భారతీయుల ప్రమేయం ఏమైనా ఉందో తెలుసుకుంటున్నట్లు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఇప్పటివరకు భారతీయుల సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదు. ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది.

Flydubai Pilot Smit Machchhar Recounts His Terrifying Escape, Shares Details With PM Modi

యూఏఈకి కీలక అభ్యర్థన

ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్ఐఏ ఇప్పటికే యూఏఈకి పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (Mutual Legal Assistance Treaty – MLAT) కింద అభ్యర్థన పంపింది.ఈ అభ్యర్థనలో రెండు కీలక అంశాలను ప్రస్తావించింది. – ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు, ఆధారాల కాపీలు అందించాలని కోరింది. – యూఏఈలో ఉన్న కొందరు వ్యక్తులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం యూఏఈ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఎన్ఐఏ చీఫ్ తెలిపారు. అక్కడి నుంచి అవసరమైన పత్రాలు, సమాచారం అందిన తర్వాత దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో ఎవరిని కలిశాడు?

నిందితుడి విద్యాభ్యాసం, గత పరిచయాలపైనా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అతడు ఆస్ట్రేలియా లేదా బ్రిటన్‌లో చదువుకున్నట్లు వస్తున్న సమాచారాన్ని పరిశీలిస్తోంది. అక్కడ చదువుకున్న సమయంలో ఎవరెవరితో స్నేహం చేశాడు? ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి? ఆ పరిచయాల్లో భారతీయులు ఎవరైనా ఉన్నారా? ఆ వివరాలను సేకరిస్తోంది.అతడి అంతర్జాతీయ పరిచయాల వెనుక ఏదైనా అనుమానాస్పద నెట్‌వర్క్ ఉందా? ఈ దాడికి మరెవరైనా సహకరించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

సెప్టెంబర్ 30.. విమానంలో అసలేం జరిగింది?

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ఫ్లై దుబాయ్‌కు చెందిన FZ 1073 విమానం బయలుదేరింది. ఇందులో 174 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సౌదీ అరేబియా గగనతలంలో.. జోర్డాన్-సౌదీ అరేబియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఒమన్‌కు చెందిన కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేసాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. విమానాన్ని హైజాక్ చేయడం లేదా కూల్చివేయడం లక్ష్యంగా దాడి జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అయితే విమానంలోని ఇతర పైలట్లు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. నిందితుడిని సౌదీ అధికారులు అరెస్టు చేశారు.

ఉగ్రవాద కోణంలోనూ దర్యాప్తు

ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను వెలికితీసేందుకు ఎన్ఐఏ అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది. 2016 నాటి యాంటీ హైజాకింగ్ చట్టంలోని సెక్షన్ 3తో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని సెక్షన్ 16ను కూడా ప్రయోగించింది. ఈ సెక్షన్ ఉగ్రవాద చర్యలకు సంబంధించినది. దీంతో ఈ కేసును ఎన్ఐఏ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థమవుతోంది. కేవలం విమానంలో జరిగిన దాడి వరకే కాకుండా.. దాని వెనుక ఉన్న వ్యక్తులు, పరిచయాలు, అంతర్జాతీయ సంబంధాలపై కూడా దర్యాప్తు సాగిస్తోంది. మొత్తానికి ఫ్లై దుబాయ్ పైలట్‌పై దాడి కేసు ఇప్పుడు అంతర్జాతీయ దర్యాప్తు స్థాయికి చేరింది. నిందితుడి వెనుక ఎవరైనా ఉన్నారా? అతడి స్నేహితుల వర్గంలో భారతీయుల ప్రమేయం ఉందా? యూఏఈ నుంచి వచ్చే సమాచారం ఈ కేసులో ఎలాంటి కొత్త విషయాలను బయటపెడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us