- Telugu News Photo Gallery Nellore Rottela Panduga: India's Unique Wish Fulfilling Festival of Rotis and Harmony
రొట్టెల పండుగ కథ తెలిస్తే ఆశ్చర్య పోతారు.. ఇది ఎలా మొదలైందంటే?
మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ గురించి ఎప్పుడైనా విన్నారా ?. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అక్కడకు భక్తులు క్యూ కడుతుంటారు. అలా అని నిత్యం ఈ పండుగ జరగదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే ఈ వేడుకలు జరుగుతుంటాయి.
Updated on: Jun 27, 2026 | 1:15 PM

రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఇక ఈ పండుగలో, కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునే వారు కొందరైతే..కోరిక తీరిన తర్వాత రొట్టె వదిలే వారు మరి కొందరు. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టెల పండుగ కాదు.. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు ఇక్కడి వస్తారు. భక్తివిశ్వాలతో అమరవీరుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు. ఇంతకీ ఇది ఎక్కడంటే?

నెల్లూరులో శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది ఈ పండుగ. చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె ఇలా 12 రకాల కోర్కెలకు సంబంధించిన రొట్టెలు ప్రత్యేకం. గతంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కూడా రొట్టెల పండగకి వచ్చి రొట్టెలు స్వీకరించారు. ఈ ఏడాది భారీ ఏర్పాట్లతో అత్యంత వేడుకగా రొట్టెల పండగ నిర్వహించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రులు కూడా రొట్టెల పండుగకు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రొట్టెలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

అసలు నెల్లూరులో రొట్టెల పండుగ ఎలా మొదలైంది? ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్‌లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్య భర్తలిద్దరు గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో వున్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది.

దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి నెల్లూరులోని స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్థనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాల గమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనటంతో ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటున్నారు.

పన్నెండు మంది వీరుల కథ ..స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న బారా షాహిదుల సమాధుల వద్ద ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ప్రపంచ శాంతి కోసం 12 మంది గుర్రాల పై ప్రచారం చేస్తూ వస్తున్నారు.. నెల్లూరు జిల్లా గంగవరం వద్ద తిరుగుబాటు దారులు వారి తలలు నరికివేయడంతో తల మొండెం వేరు వేరు అయ్యాయి. గుర్రాలపై మొండాలు నెల్లూరు లోని స్వర్ణాల చెరువు వద్ద వచ్చి ఆగాయి. పన్నెండు అంటే బారా షహీదులు, వీరు వీరులని అర్ధం అందుకే బారా షహీద్ దర్గా అని పిలుస్తారు.
