పేరు ఒకరిది.. వాడకం మరొకరిది.. రూ. 8.18 కోట్ల భారీ ‘మ్యూల్ అకౌంట్’ స్కాం బట్టబయలు!
బ్యాంకు ఖాతా మనదే, ఏటీఎం కార్డు, చెక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్.. అన్నీ మనవే! కానీ ఆ అకౌంట్‌ను నిర్వహించేది మాత్రం మనం కాదు, దేశ విదేశాల్లో కూర్చున్న సైబర్ నేరగాళ్లు. అమాయకుల నమ్మకాన్ని, డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని, దొంగ కంపెనీల పేరిట కోట్లాది రూపాయల సైబర్ నేరాల సొమ్మును చేరవేస్తున్న ఒక భారీ 'మ్యూల్ అకౌంట్ల' ముఠా బాగోతాన్ని నిర్మల్ జిల్లా పోలీసులు తాజాగా బట్టబయలు చేశారు.

బ్యాంకు ఖాతా మనదే, ఏటీఎం కార్డు, చెక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, దానికి లింక్ అయిన ఫోన్ నంబర్.. అన్నీ మనవే! కానీ ఆ అకౌంట్‌ను నిర్వహించేది మాత్రం మనం కాదు, దేశ విదేశాల్లో కూర్చున్న సైబర్ నేరగాళ్లు. అమాయకుల నమ్మకాన్ని, డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని, దొంగ కంపెనీల పేరిట కోట్లాది రూపాయల సైబర్ నేరాల సొమ్మును చేరవేస్తున్న ఒక భారీ ‘మ్యూల్ అకౌంట్ల’ ముఠా బాగోతాన్ని నిర్మల్ జిల్లా పోలీసులు తాజాగా బట్టబయలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మహేందర్, అలాగే సోన్ మండలం మాదాపూర్‌కు చెందిన మేకల నిఖిల్, సాయికృష్ణ అనే ఐదుగురు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. వీరిలో ఒకరు గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక సైబర్ నేరగాడితో పరిచయమైంది. ఆ పరిచయంతో స్వగ్రామానికి వచ్చిన తర్వాత, మిగిలిన నలుగురితో కలిసి 2024 నుంచి ఒక పక్కా స్కెచ్ వేశారు.
పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఉంటుందని తమ పేర్లతో పాటు నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచారు. సైబర్ ముఠాలు ఇచ్చే నెలవారీ కమిషన్ల ఆశకు లోబడి.. ఆ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లకు అప్పగించారు. సైబర్ కేటుగాళ్లు ఈ అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అమాయకులను ముంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లో చేరవేశారు.
నకిలీ కంపెనీలు – జరిగిన లావాదేవీల వివరాలు:
* ఆర్వీ ట్రేడర్స్ (నిమ్మ గజేందర్): రూ. 2.69 కోట్లు
* ఆజాన్ ట్రేడర్స్ (మగ్గిడి నవీన్): రూ. 2.11 కోట్లు
* ఎన్.ఆర్ ఎంటర్‌ప్రైజెస్ (మహేందర్): రూ. 91.36 లక్షలు
* హెచ్.ఆర్ ఆటోమొబైల్స్ హార్డ్‌వేర్ (మేకల నిఖిల్): రూ. 1.18 కోట్లు
* హెచ్.ఎన్ ఎంటర్‌ప్రైజెస్ (సాయికృష్ణ): రూ. 1.28 కోట్లు
ఇలా ఐదు అకౌంట్ల ద్వారా మొత్తం సుమారు రూ. 8.18 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు సాగించారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నేషనల్ సైబర్ రిపోర్టింగ్ ప్లాట్‌ఫాం (NCRB) పోర్టల్‌లో ఈ ముఠా అకౌంట్లపై ఏకంగా 64 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో నవీన్‌పై 28, నిఖిల్‌పై 16, గజేందర్‌పై 9, సాయికృష్ణపై 6, మహేందర్‌పై 5 చొప్పున కేసులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల లింకులను పట్టుకుని నిర్మల్ జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరపగా ఈ భారీ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లకు సహకరించినందుకు గానూ గజేందర్, నవీన్, మహేందర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, నిఖిల్, సాయికృష్ణలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మారుమూల గ్రామాలకు చెందిన యువకులు ఇలా అంతర్జాతీయ సైబర్ ముఠాలకు అకౌంట్లు అమ్మి బుక్కవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
