AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఓరి మీకు కాలం రాను.. మామిడికాయ పచ్చడి ఎత్తుకుపోవుడు ఏందిరా..?

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దొంగలు విచిత్ర చోరీకి పాల్పడ్డారు. ఐదు కాసుల బంగారం, రూ.60 వేల నగదుతో పాటు బియ్యం, వంటనూనె, నిత్యావసర సరుకులు కూడా ఎత్తుకెళ్లారు. అంతేకాదు, పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు వేసుకుని వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Khammam: ఓరి మీకు కాలం రాను.. మామిడికాయ పచ్చడి ఎత్తుకుపోవుడు ఏందిరా..?
Pickle Theft
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 26, 2026 | 10:11 AM

Share

సాధారణంగా దొంగలు నగదు, బంగారం, విలువైన వస్తువులనే లక్ష్యంగా చేసుకుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ చోరీ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగారం, నగదుతో పాటు బియ్యం, వంటనూనె, నిత్యావసర సరుకులు కూడా దొంగలు ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటిలో చొరబడ్డ దుండగులు సుమారు ఐదు కాసుల బంగారం, రూ.60 వేల నగదుతో పాటు వంటనూనె, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను కూడా దోచుకెళ్లారు.

ఇంతటితో ఆగకుండా, ఇంట్లో ఉన్న ఊరగాయ పచ్చడి సైతం ఎత్తుకెళ్లారు. మరీ దారుణంగా పాత చెప్పులను అక్కడే వదిలేసి, కొత్త చెప్పులు వేసుకుని వెళ్లడం గమనార్హం. ఈ విచిత్ర చోరీ స్థానికులను విస్మయానికి గురిచేసింది. దొంగలు దేనినీ వదిలిపెట్టకుండా దొరికిన ప్రతి వస్తువును తీసుకెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కాగా, పెనుబల్లి మండలంలో గత కొద్ది రోజులుగా అర్ధరాత్రి వేళ దొంగల ముఠా సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే తరహాలో ఇళ్లలోకి చొరబడి, గడ్డపారలతో తలుపులు, బీరువాలు పగులగొట్టి నగదు, నగలను దోచుకెళ్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల ఈ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈలోపే మరోసారి చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ నిద్రపోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

బాధితురాలు మాట్లాడిన వీడియో దిగువన చూడండి..

Follow Us