యుద్ధ భయంతో రూట్ మార్చినా రిస్క్ మారలేదు.. వెనిజులా భూకంపంతో భారత్‌కు కొత్త కష్టాలు..
ఇరాన్ గండం గడిచింది అనుకుంటే.. వెనిజులా ముంచేసింది.. పశ్చిమాసియా యుద్ధ భయాల నుండి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న భారత చమురు రంగానికి ఊహించని షాక్ తగిలింది. వెనిజులాలో సంభవించిన భయంకర భూకంపం.. భారత్ కొత్త చమురు సరఫరా మార్గాలను ఎలా దెబ్బతీయబోతుంది..? అనే విషయాలు తెలుసుకుందాం..

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగి..ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న భారత చమురు రంగానికి మరో బిగ్ షాక్ తగిలింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో సంభవించిన అతిపెద్ద భూకంపం భారత్ ఇంధన భద్రతపై సరికొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. జూన్ 24న వెనిజులాలో కొద్ది సెకన్ల వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. గత 125 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే కావడం గమనార్హం. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. వెనిజులా ప్రధాన కార్గో గేట్‌వే అయిన లా గుఐరా పోర్టులో విపత్తు అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో భారత్‌కు వచ్చే చమురు రవాణాపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ గండం గడిచింది అనుకుంటే..
ఇటీవల ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గంలో చమురు రవాణా స్తంభించిపోయింది. అయితే కేవలం కొన్ని రోజుల క్రితమే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సరఫరా లైన్ క్లియర్ అవుతుందని భారత్ భావించింది. మిడిల్ ఈస్ట్‌పై ఎక్కువగా ఆధారపడకుండా భారత్ ఈ మధ్య కాలంలో వెనిజులా నుండి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వెనిజులా నుండి దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగి భారత్‌కు అది అత్యంత ముఖ్యమైన చమురు సరఫరాదారుగా మారింది. కరెక్ట్‌గా ఇలాంటి సమయంలోనే ఈ భూకంపం సంభవించడం దేశీయ రిఫైనర్లను ఆందోళనలో పడేసింది.
షిప్పింగ్ ఆలస్యం.. పెరగనున్న భీమా ధరలు..
గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ EDME మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఖన్నా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విపత్తు వల్ల కేవలం చమురు బావులకు నష్టం జరగడమే కాదు.. అంతకు మించిన సరఫరా గొలుసు సమస్యలు ఎదురుకానున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రవాణా లింకులు దెబ్బతినడం వల్ల పోర్టుల వద్ద పనులు రోజులు లేదా వారాల పాటు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చమురు లోడ్ చేసుకోవడానికి వచ్చే షిప్‌లు పోర్టుల వద్ద ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ఆలస్య రుసుములు పెరిగి, ఆ భారం అంతిమంగా ట్రేడర్లు, రిఫైనర్లు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలపై పడుతుంది. ఇప్పటివరకు వెనిజులా చమురు మార్గాన్ని కేవలం రాజకీయ, షిప్పింగ్ కోణాల్లోనే చూశారు. కానీ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల రిస్క్ కూడా ఇందులో తోడైంది.
భారత్‌కు నేరుగా నష్టం..
ఈ సంక్షోభం కేవలం సముద్రంలో ఉన్న చమురు రవాణా నౌకలకే పరిమితం కాదు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ONGC విదేశ్ లిమిటెడ్‌కు వెనిజులా చమురు ప్రాజెక్టులలో నేరుగా పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ చమురు ఉత్పత్తి దీర్ఘకాలం పాటు నిలిచిపోతే భారత్‌కు భారీగా ఆర్థిక, కార్యాచరణ నష్టాలు తప్పవు. ఈ నెల ప్రారంభంలోనే ప్రధాని మోదీ.. వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. చమురుతో పాటు మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ రంగాలలో భారత కంపెనీల పెట్టుబడులపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి. అయితే ప్రస్తుత విపత్తు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
