AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ఎన్ని డిగ్రీల వద్ద కాలిపోతుంది..?

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మానవ శరీరంపై ఎంత ప్రభావం చూపిస్తాయి? చర్మం ఎంత వేడిని తట్టుకోగలదు? హీట్ స్ట్రోక్ ఎలా వస్తుంది? తీవ్రమైన వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలను శాస్త్రీయంగా వివరించే ప్రత్యేక కథనం.

మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ఎన్ని డిగ్రీల వద్ద కాలిపోతుంది..?
Summer Heat
M Revan Reddy
| Edited By: |

Updated on: May 22, 2026 | 12:48 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు మరింత మండిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి వేడి కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత కేవలం చెమటలు పట్టడమే కాదు, శరీరంలోని అంతర్గత అవయవాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అసలు మానవ శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు? ఏ ఉష్ణోగ్రత వద్ద చర్మం దెబ్బతినడం ప్రారంభమవుతుంది? ఈ విషయాలను శాస్త్రీయంగా, సులభంగా అర్థం చేసుకుందాం.

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఒక నిర్దిష్ట అంతర్గత ఉష్ణోగ్రత అవసరం. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ (98.6°F) వద్ద ఉంటుంది. బయట వాతావరణం ఎంత వేడిగా ఉన్నా, శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.

బయట వేడి పెరిగినప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి కొన్ని సహజ ప్రక్రియలను ఉపయోగిస్తుంది.

చెమట పట్టడం: చర్మంపై వచ్చే చెమట ఆవిరి కావడం ద్వారా శరీరం చల్లబడుతుంది.

రక్త ప్రసరణ పెరగడం: గుండె వేగంగా పనిచేస్తూ రక్తాన్ని చర్మం వైపు పంపిస్తుంది. దీంతో శరీరంలోని వేడి బయటకు విడుదల అవుతుంది.

శ్వాస వేగం పెరగడం: వేగంగా శ్వాస తీసుకోవడం ద్వారా కూడా కొంత వేడి బయటకు వెళ్తుంది.

45 డిగ్రీల సెల్సియస్ దాటితే ఏమవుతుంది..?

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరినప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకోవడం కష్టమవుతుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవచ్చు. చెమట ద్వారా శరీరం చల్లబడకపోతే అంతర్గత ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరిగి వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగులుతుంది.

హీట్ స్ట్రోక్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే మెదడు, గుండె, కిడ్నీలు వంటి ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తీవ్ర స్థితిలో ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.

చర్మం ఎంత వేడిని తట్టుకోగలదు..?

మానవ చర్మం కూడా ఒక నిర్దిష్ట స్థాయి వరకు మాత్రమే వేడిని తట్టుకోగలదు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 44 డిగ్రీల సెల్సియస్ దాటిన దగ్గర నుంచే చర్మ కణజాలంపై ప్రభావం ప్రారంభమవుతుంది. అయితే అది వెంటనే కనిపించకపోవచ్చు. పొడి వేడి పరిస్థితుల్లో మన చర్మం కొద్దిసేపు 48 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకోగలదు. కానీ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత చర్మ కణజాలం వేగంగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ చర్మం దెబ్బతినే వేగం కూడా పెరుగుతుంది. ఉదాహారణకు.. 50°C వేడి ఉన్న నీరు లేదా వస్తువు చర్మాన్ని కొద్ది నిమిషాలు తాకితే చర్మ కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. అదే 55°C వద్ద అయితే కేవలం కొన్ని సెకన్లలోనే చర్మం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 60°C వద్ద అయితే చాలా తక్కువ సమయంలోనే తీవ్రమైన కాలిన గాయాలు సంభవించవచ్చు. ప్రత్యేకంగా వేడి నీరు, ఆవిరి లేదా తేమ ఉన్న వేడి మరింత ప్రమాదకరం. ఎందుకంటే తేమ వేడిని చాలా వేగంగా చర్మానికి బదిలీ చేస్తుంది. దీంతో చర్మం తక్కువ సమయంలోనే తీవ్రంగా దెబ్బతింటుంది.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనవసరంగా బయట తిరగకూడదు. దాహం వేయకపోయినా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్‌ఎస్ ద్రావణం తాగాలి. లేత రంగు, సుతిమెత్తని కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, సన్‌గ్లాసెస్ వాడాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తపడాలి. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అధిక చెమటలు, కళ్లు తిరగడం, శరీరం వేడెక్కిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రికార్డు స్థాయి ఎండలు నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే వడదెబ్బ, డీహైడ్రేషన్, చర్మ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

 మిగతావన్నీ వేస్ట్.. ఈ ఎర్రటి ఎండల్లో దీన్ని కొట్టేది లేదు.. 

Follow Us