AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని నిరూపించే మరో ఘోరకలి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం రెండు ఎకరాల భూమి కోసం, కన్నతల్లి లాంటి పినతల్లిని ఓ కిరాతకుడు వేటకొడవలితో నరికి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!
Murder For Property
Balaraju Goud
|

Updated on: May 22, 2026 | 12:35 PM

Share

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని నిరూపించే మరో ఘోరకలి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం రెండు ఎకరాల భూమి కోసం, కన్నతల్లి లాంటి పినతల్లిని ఓ కిరాతకుడు వేటకొడవలితో నరికి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి గ్రామంలోని హరిజనవాడకు చెందిన గాదిలింగ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన తన చిన్న భార్య అయిన ఎల్లమ్మ (50) జీవనాధారం కోసం రెండు ఎకరాల భూమిని రాసిచ్చాడు. అయితే, గాదిలింగ పెద్ద భార్య కుమారుడైన శేకన్న కన్ను ఆ భూమిపై పడింది. ఎలాగైనా ఆ ఆస్తిని తన వశం చేసుకోవాలని పథకం వేశాడు.

ఘటన జరిగిన రాత్రి శేకన్న మద్యం మత్తులో పినతల్లి ఎల్లమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె పేరు మీద ఉన్న రెండు ఎకరాల పొలాన్ని తన పేరు మీద రాసివ్వాలని అంటూ గొడవకు దిగాడు. అందుకు ఎల్లమ్మ.. తనకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వారి భవిష్యత్తు కోసం ఈ భూమి కావాలి, రాసి ఇవ్వనంటూ తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శేకన్న, మొదట ఆమెపై కర్రతో దాడి చేశాడు. అంతటితో శేకన్న కసి తీరలేదు. అర్థరాత్రి సమయంలో ఎల్లమ్మ తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా, శేకన్న వేటకొడవలితో అక్కడికి చేరుకున్నాడు. నిద్రపోతున్న పినతల్లి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా నరికి ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘోర హత్యతో సులువాయి గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి ముగ్గురు కుమార్తెలు తల్లి శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్తి కోసం కన్నవారిని, కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకుంటున్న కాలానికి ఈ సంఘటన మరో మాయని మచ్చగా మిగిలింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us