AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : చెన్నైకి డబుల్ షాక్.. ఐపీఎల్ నుంచి ఔట్.. కెప్టెన్ సహా టీమ్ మొత్తానికి బీసీసీఐ భారీ జరిమానా

IPL 2026 : గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో ఓడి ఐపీఎల్ 2026 నుంచి చెన్నై అవుట్ అవ్వడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్‌కు రూ. 24 లక్షల జరిమానా పడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది.

IPL 2026 : చెన్నైకి డబుల్ షాక్.. ఐపీఎల్ నుంచి ఔట్.. కెప్టెన్ సహా టీమ్ మొత్తానికి బీసీసీఐ భారీ జరిమానా
Csk
Rakesh
|

Updated on: May 22, 2026 | 12:13 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్థానం అత్యంత దారుణమైన పరాజయంతో ముగిసింది. గురువారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) జట్లతో జరిగిన చావో రేవో లాంటి చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించడమే కాకుండా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ నుంచి చెన్నై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ భారీగా జరిమానా విధించారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (64), సాయి సుదర్శన్ (84) మొదటి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, చివర్లో జోస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ కీపర్ సంజూ శాంసన్ డకౌట్ రూపంలో వికెట్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. శివమ్ దూబే కేవలం 17 బంతుల్లో 47 పరుగులు చేసి మెరిపించినప్పటికీ, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, కగిసో రబాడ చెరో మూడు వికెట్లతో చెన్నై నడుము విరిచారు. దీంతో సిఎస్‌కే జట్టు 13.4 ఓవర్లలోనే కేవలం 140 పరుగులకే కుప్పకూలి 89 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.

ఈ అవమానకరమైన ఓటమి బాధలో ఉన్న చెన్నై జట్టుకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా రూపంలో మరో కోలుకోలేని షాక్ ఇచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయనందుకుగానూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఏకంగా రూ.24 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించడం ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది రెండోసారి కావడం వల్ల ఈ పెనాల్టీ మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఇంతకుముందు 18వ మ్యాచ్‌లో కూడా సిఎస్‌కే ఈ తప్పుకు పాల్పడింది.

రెండోసారి కూడా ఒకే తప్పు పునరావృతం కావడంతో ఈసారి శిక్ష కేవలం కెప్టెన్‌కే పరిమితం కాలేదు. మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ ఎలెవన్ సభ్యులతో పాటు బరిలోకి దిగిన ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా బీసీసీఐ జరిమానా విధించింది. కెప్టెన్ మినహా మిగిలిన ఆటగాళ్లందరికీ చెరో రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఆఖరి మ్యాచ్‌లో కూడా ఇలా మైదానంలో క్రమశిక్షణ తప్పడంపై మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది.

ఈ దారుణ పరాజయం తర్వాత సామాజిక మాధ్యమాలలో చెన్నై అభిమానులు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదైన బ్యాటింగ్ తీరుపై, జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీనియర్ లెజెండ్ ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గాయాల సమస్యలు, ఆటగాళ్ల పేలవమైన ఫామ్ కారణంగా ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమైన ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us