AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2047 వికసిత్ భారత్‌కు ప్రధాని మోదీ ‘సప్తధార’.. దేశ భవిష్యత్తును మార్చే ఏడు శక్తులివే!

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రగతికి కొత్త శక్తి ప్రవాహాలు అవసరమని పేర్కొంటూ.. ఏడు ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే ‘సప్తధార’ సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో ఈ ఏడు రంగాల సమిష్టి శక్తితో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

2047 వికసిత్ భారత్‌కు ప్రధాని మోదీ ‘సప్తధార’.. దేశ భవిష్యత్తును మార్చే ఏడు శక్తులివే!
Pm Modi Sapthadhara Shakti
Balaraju Goud
|

Updated on: Aug 15, 2026 | 11:12 AM

Share

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రగతికి కొత్త శక్తి ప్రవాహాలు అవసరమని పేర్కొంటూ.. ఏడు ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే ‘సప్తధార’ సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో ఈ ఏడు రంగాల సమిష్టి శక్తితో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

భారత్‌ గతంలో ‘సప్త సింధు’తో శక్తిమంతమైన నాగరికతగా వెలుగొందిందని గుర్తుచేసిన ప్రధాని మోదీ.. ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి ‘సప్తధార’ శక్తి అవసరమని అన్నారు. దేశ అభివృద్ధిని ఏడు వేర్వేరు రంగాలుగా చూడకుండా.. వాటి పరస్పర అనుసంధానంతో సమగ్ర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మొదటిది తయారీ శక్తి

‘సప్తధార’లో మొదటి శక్తిగా తయారీ రంగాన్ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చిన్న విడిభాగాల నుంచి భారీ ఉత్పత్తుల వరకు భారత్‌లోనే తయారు చేయాలని పిలుపునిచ్చారు. డిజైన్‌ నుంచి తయారీ వరకు సంపూర్ణ విలువైన చెయిన్ సిస్టమ్ నిర్మించి.. ప్రపంచానికి విశ్వసనీయమైన గ్లోబల్ సప్లైచైన్ భాగస్వామిగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. ధర, నాణ్యత, పరిమాణంలో ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలకు సూచించారు.

రెండోవది వ్యవసాయ-ఆహార శక్తి

రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, శుద్ధి రంగాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత రైతులు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ మార్కెట్లను చేరుకోవాలని పిలుపునిచ్చారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేసి ప్రపంచ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని అన్నారు. వ్యవసాయ క్షేత్రం నుంచి ఎగుమతి మార్కెట్ వరకు పూర్తి విలువ గొలుసు అవసరమని ప్రధాని పేర్కొన్నారు.

మూడోవది టెక్నాలజీ-ఆవిష్కరణ శక్తి

మూడో శక్తిగా సాంకేతికత, ఆవిష్కరణలను ప్రధాని గుర్తించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదగాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలోనూ దేశం ముందుండాలని, మేడ్ ఇన్ ఇండియా 6జీని ప్రపంచానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు.

నాలుగోవది గతిశక్తి

నాలుగో శక్తిగా గతి శక్తిని పేర్కొంటూ వేగవంతమైన కనెక్టివిటీని పెంచాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించాలని అన్నారు. నగరాలను హైస్పీడ్ రైళ్లతో అనుసంధానించడంతో పాటు.. పోర్టులను కేవలం సరుకు రవాణా కేంద్రాలుగా కాకుండా అభివృద్ధికి చోదక శక్తులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఐదోవది రక్షణ శక్తి

ఐదో శక్తిగా రక్షణ రంగాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. భారత్ రక్షణ ఉత్పత్తుల్లో పూర్తిగా ఆత్మనిర్భర్‌గా మారాలని అన్నారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతికతలు, సైబర్ భద్రత వంటి ఆధునిక రంగాల్లో భారత్ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ప్రపంచానికి కేవలం మార్కెట్‌గా కాకుండా అత్యాధునిక రక్షణ సాంకేతికతల సరఫరాదారుగా భారత్ ఎదగాలని పిలుపునిచ్చారు.

ఆరోవది గ్రీన్-బ్లూ ఎకానమీ

ఆరవ శక్తిగా హరిత, నీలి ఆర్థిక వ్యవస్థలను ప్రధానమంత్రి పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ రంగాల్లో ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. అదే సమయంలో దేశంలోని విస్తారమైన తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని మత్స్య పరిశ్రమ, తీర ప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికత వంటి రంగాల్లో బ్లూ ఎకానమీని బలోపేతం చేయాలని సూచించారు.

ఏడోవది యువశక్తి-సాఫ్ట్ పవర్

ఏడో శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్‌ను ప్రధాని మోదీ ప్రస్తావించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సంపూర్ణ ఆరోగ్యం, హస్తకళలు, సంస్కృతి, సినిమాలు, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు. ‘హీల్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలతో వైద్య పర్యాటకాన్ని విస్తరించాలని, దేశంలోని ప్రకృతి సంపద, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటకులకు మరింత చేరువ చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ఈ ఏడు శక్తులు ఒక్కొక్కటి విడివిడిగా పనిచేసే రంగాలు కావని ప్రధాని స్పష్టం చేశారు. తయారీకి టెక్నాలజీ, వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులకు లాజిస్టిక్స్, రక్షణకు ఆవిష్కరణలు, గ్రీన్ ఎకానమీకి యువశక్తి వంటి అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అన్నారు. ఈ సమిష్టి శక్తితో వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లి.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వేగం పెంచుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us