Telangana: మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!
ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు. అయితే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన మిరప తోటలో వెరైటీ ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ప్లెక్సీ ని చూసిన వారంతా ఆశ్చర్యంగా, ఆసక్తిగానూ చూస్తున్నారు.
పంటపొలంలో అడవి జంతువులు, పక్షులు దాడి చేసి నాశనం చేయకుండా ఉండేందుకు రైతులు పలు రకాల చర్యలు చేపడుతుంటారు. అయితే, ఇందుకోసం సాధారణంగా రైతులు పంట పొలంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. కొంతమంది రైతులు పక్షులను తరిమికొట్టేందుకు తమ పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు అడవి జంతువులను భయపెట్టేందుకు రకరకాల ఫ్లేక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు దెయ్యాలు, సినీ తారల ఫోటోలతో కూడా ఫ్లేక్సీలు కూడా కడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లేక్సీ స్థానికుల్ని అవాక్కయ్యేలా చేసింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం కు చెందిన సురేష్ అనే రైతు రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో తన మిరప పంటపై ఇతరుల దృష్టి పడకుండా పలు రకాల ప్లెక్సీ లు ఏర్పాటు చేశాడు. అందులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం రైతు ఆవేదనను బహిర్గతపరుస్తోంది. ప్లెక్సీ లో అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న నన్ను చూసి ఏడవకురా అనే అక్షరాలతో పాటు యువత మేలుకో రైతన్నను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేయడం తో ఆదారి వెంట వెళ్లే వారు రైతు సురేష్ ఏర్పాటు చేసిన ప్లెక్సీ ని ఆసక్తిగా చూస్తున్నారు.
రైతు సురేష్ మాత్రం యువత ఎక్కువ ఉద్యోగం పైనే ఆసక్తి చూపుతున్నారని, వారు కూడా వ్యవసాయం పై దృష్టి సారించాలని కోరుతున్నాడు. అంతే కాకుండా యువకులు కూడా వ్యవసాయం చేసే రైతులకు తోడ్పాటు అందించాలని సురేష్ సూచిస్తున్నాడు.