PM Modi: త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. చర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం అవుతుందని తెలిపారు.

PM Modi: త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 06, 2025 | 2:33 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. చర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉంది. రాష్ట్ర ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమన్నారు. చర్లపల్లి టెర్మినల్‌తో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని మోదీ వివరించారు.. వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని..రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని.. నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యమని.. రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోందన్నారు. వందే భారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టామని.. త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం అవుతుందని తెలిపారు.

చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేశారు. చర్లపల్లి స్టేషన్ తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా త్వరలో మొదలుపెట్టాలని కోరారు. మచిలీపట్నం పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడంతో పాటు తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. అంతే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు.

ఎన్నో ప్రత్యేకతలు..

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో నాల్గో అతి పెద్ద రైల్వే స్టేషన్‌. ఎయిర్‌పోర్ట్‌ని తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరిగింది. 413 కోట్ల వ్యయంతో టెర్మినల్‌ నిర్మించారు. 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్‌ ఏసీ హాల్స్, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు సహా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే పరిధిలో ఈ అతిపెద్ద టెర్మినల్‌ నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో వందేళ్ల తర్వాత మరో అతి పెద్ద రైల్వే స్టేషన్‌.. ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సిద్ధం కావడంతో.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది.

చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే సహాయమంత్రి సోమన్న, బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..