చుట్టూ సింహాలున్నా బెదరని బుడ్డోడు.. ఏం చేశాడంటే?

చుట్టూ సింహాలున్నా బెదరని బుడ్డోడు.. ఏం చేశాడంటే?

Samatha J

|

Updated on: Jan 07, 2025 | 6:52 PM

అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్‌ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. టినోటెండా పుందు అనే బాలుడు  పండ్లు తింటూ.. చెలమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్‌ పార్క్‌లో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయినా అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

 ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలమలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. రాత్రిపూట రాతి బండలపై  నిద్రపోయాడు. కనిపించకుండా పోయిన బాలుని కోసం  ఊరంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్‌ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెతికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్‌ రేంజర్లు వాహనంపై అడవి మొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడి నుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుందుని కనిపెట్టగలిగారు.