భయ్యా.. థోడా ట్యాక్స్ దాలో..?

భయ్యా.. థోడా ట్యాక్స్ దాలో..?

Samatha J

|

Updated on: Jan 07, 2025 | 7:47 PM

మనం సరదాగా బయటకెళ్తే చాలు. ఎక్కడో ఓ గల్లీలో పానీపూరి బండి కనిపిస్తుంది. ఎంత వద్దనుకున్నా సరే మనసు అటు లాగుతూనే ఉంటుంది. ఏముందిలే..ఓ పది రూపాయలే కదా అని వెళ్లి..ఆ పదితో ఆపకుండా కనీసం ఓ 50 రూపాయల బిల్ చేసి వచ్చేస్తాం. పానీపూరీకి ఉన్న స్పెషాల్టీ అలాంటిది. చిన్న, పెద్ద అని కాదు. ఎవరినైనా సరే చాలా సులువుగా టెంప్ట్ చేసేస్తుందా టేస్ట్. అందుకే ఎక్కడ ఈ పానీపూరి బండి పెట్టుకున్నా గిరాకీ వస్తూనే ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండాకళకళలాడిపోతుందీ వ్యాపారం. చాలా మంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు తరచూ వినబడే మాట ఒకటి ఉంటుంది. "ఈ జాబ్‌లు చేయడం కన్నా పానీపూరి బండి పెట్టుకోవడం నయంరా బాబు" అని జోక్‌లు వేసుకుంటారు. కానీ... పానీపూరి బండి పెట్టుకున్న ఓ వ్యక్తి ఆదాయం చూస్తే కళ్లు తేలేస్తాం.

కరెక్ట్‌గా ఇంత అని చెప్పలేకపోయినా..పెట్టుబడి కన్నా కనీసం పదింతల ఆదాయాన్ని చూస్తారు ఈ వ్యాపారులు. ఇదేమీ ఎక్సాగరేషన్ కాదు. కావాలంటే ఈ ఉదాహరణనే చూడండి. తమిళనాడులో ఓ పానీపూరి వ్యాపారికి GST నోటీస్ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ వ్యక్తి ఆదాయం 40 లక్షల రూపాయలు దాటింది. ఈ ఆదాయమంతా UPI పేమెంట్స్ ద్వారా వచ్చిందే. ఈ నోటీస్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పెట్టగానే..ఇలా వైరల్ అయిపోయింది. పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి ఇంత ఇన్‌కమ్ ఉంటుందా అన్నదే ఓ ఆశ్చర్యకరమైన విషయమైతే..GST నోటీస్‌లు పంపడం మరో ఇంట్రెస్టింగ్ అంశం. తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్,సెంట్రల్ జీఎస్‌టీ ట్యాక్స్ చట్టాల్లోని ఓ సెక్షన్ ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. దాదాపు మూడేళ్లుగా ఆ వ్యక్తికి ఏటా ఎంత ఇన్‌కమ్ వస్తోందో…UPI ద్వారా ఎంత మేర చెల్లింపులు జరుగుతున్నాయో ఆ నోటీస్‌లో చాలా క్లియర్‌గా ఉంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తున్నాయి. డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. GST నోటీస్ ఇవ్వడం అంటే..ఇకపై పానీపూరి వ్యాపారాలపైనా కేంద్రం ఫోకస్ పెడుతుందా..? అన్న డిస్కషన్ మొదలైంది. అదే జరిగితే..ఈ వ్యాపారులు కూడా ట్యాక్స్ పేయర్స్ అవుతారు.