HMPV Virus: ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..
హ్యూమన్ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.
తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు తిష్టవేసింది కరోనా. ఇప్పుడు చైనాలో విభృంభిస్తున్న వైరస్.. ఇండియాను కూడా తాకింది. బయటపడ్డ కేసులు తక్కువే. దాని తీవ్రతా తక్కువే. అచ్చం తొలినాళ్లలో వచ్చిన కరోనాలా. మరి.. ఈ కొత్త వైరస్‌కు భయపడాలా వద్దా? ICMR గానీ, కేంద్ర ఆరోగ్య శాఖ గానీ.. అసలేం కంగారుపడొద్దంటోంది. వైద్యులు కూడా ఇదో సాధారణ జలుబు లాంటిదే అంటున్నారు. అయినా సరే.. భయపడకుండా ఉండాలా వద్దా? ఇప్పటి వరకైతే మరణాలు సంభవించినట్టుగా ఎక్కడా లేదు. కాని, పాతికేళ్ల hMPV హిస్టరీని చూసుకుంటే ఈ వైరస్ సోకిన వాళ్లు చనిపోలేదా అంటే.. చనిపోయారు కూడా. అలాంటప్పుడు.. భయపడాలా వద్దా? ఓవరాల్‌గా ఈ వైరస్ గురించి, దాని లక్షణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకోవచ్చు..
హ్యూమన్ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది. HMPV వైరస్ వల్ల ఏమవుతుందని అడిగే వాళ్లకు ఇదీ సమాధానం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వైరస్‌కు ప్రత్యేకంగా మందులు లేవు, ఎలాంటి టీకాలు కూడా లేవు. HMPV సోకిందని హాస్పిటల్‌కు వెళ్తే.. జలుబుకో టాబ్లెట్, దగ్గుకో టాబ్లెట్, జ్వరం తగ్గడానికో టాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు. అదే మెడిసిన్ కూడా. అందుకే, ఈ వైరస్ గురించి పెద్దగా కంగారుపడక్కర్లేదంటున్నారు వైద్యులు. పైగా ఇది చైనా వైరస్ కాదు. చైనాలో పుట్టింది కాదిది. పాతికేళ్ల నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉందీ వైరస్. ప్రస్తుతం ఇండియాలో ఎవరికైతే ఈ వైరస్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారో.. వాళ్లెవరూ చైనా నుంచి రాలేదు. ఇతర దేశాలకు వెళ్లిన చరిత్ర కూడా వారికి లేదు. అయినా సరే.. వారికెలా HMPV సోకింది? కారణం.. ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నదే కాబట్టి. మరి.. ఓవైపు భయం లేదంటూనే ఎందుకని భయాన్ని క్రియేట్ చేస్తున్నారు? కంగారు అక్కర్లేదంటూనే.. ఆస్పత్రుల్లో పడకలు ఎందుకు సిద్ధం చేస్తున్నారు? వెంటిలేటర్లు, మోనిటర్లు, ఆక్సీజన్ లిక్విడ్, పీడియాట్రిక్ వెంటిలేటర్లు.. ఇవన్నీ ఎందుకు రెడీ చేస్తున్నారు?
కాస్త జాగ్రత్తగా వినండి. జలుబు, దగ్గు, జ్వరం వల్ల ప్రాణాలు పోవు. కాని, ఈ వైరస్ ఎగువ శ్వాసలో ఉందా, దిగువ శ్వాసలో ఉందా అన్నదే ఇంపార్టెంట్. ఎగువ శ్వాస అంటే.. జలుబు చేయడం, ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతులో నొప్పి. ఇదీ ఎగువ శ్వాస అంటారు. దిగువ శ్వాస అంటే.. వైరస్ ఊపిరితిత్తుల్లోకి పాకడం. దీనివల్ల బ్రాంకిటైస్, న్యుమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఇది కాస్త ప్రమాదకరం కావొచ్చు. ఎందుకని ఈ వైరస్ గురించి కాస్త భయపడాలి అంటే.. ఈ వైరస్ వృద్ధులపైనా, ఏడాది లోపు వయసు ఉన్న చిన్నారులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మనిషిలో ఇమ్యూనిటీ తగ్గుతుందో, రోగాన్ని ఎదుర్కొనే శక్తి శరీరంలో తగ్గుతుందో.. ఇదే జలుబు, దగ్గు న్యుమోనియాగా మారే ప్రమాదానికి తీసుకెళ్తుంది. ఆరోగ్యంగా ఉన్న వారి గురించి కంగారు అక్కర్లేదు. ఎటొచ్చీ.. తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న పెద్దవయసు వారే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, నాడుల బలహీనత, డయాబెటిస్, ఆస్థమా, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారికి ఇది ప్రమాదకరంగా మారొచ్చు. సో, ఈ జబ్బులన్నీ ఈ రోజుల్లో చాలామందికి కామన్‌గా ఉన్నవే. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు, సరైన పోషకాహారం తీసుకోని బరువు తక్కువ ఉన్న పిల్లలకు రోగనిరోధక శక్తి ఉండదు. అలాంటి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక.. ఆస్పత్రుల్లో ఎందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్న వచ్చింది కదా.. దానికి ఇదీ సమాధానం. కాకపోతే.. ఈ వైరస్ విషయంలో రెండుమూడు వాదనలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలకు, 65 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే సోకుతుందని అని చెబుతున్నారు. కాని, చైనాలో మాత్రం 14 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వచ్చింది. అంటే.. వీళ్లకి మాత్రమే వస్తుంది, ఫలానా వయసు వాళ్లకు రాదు అని చెప్పడానికి లేదా?
చైనాలో ఏం జరిగినా.. అది బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. చాలా విషయాలను చైనా దాచేస్తుంటుంది. ఇక దాయలేం అనుకున్నప్పుడు, దాయడం తన చేతుల్లో కూడా లేనప్పుడు మాత్రమే ఆ వార్త చైనాను దాటి బయటకు వస్తుంది. ఈలోపే జరక్కూడని నష్టం జరిగిపోతుంటుంది. ఈసారి కూడా అదే జరగబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఈ వైరస్ 2001లో నెదర్లాండ్స్‌లో బయటపడింది. 2001లో బయటపడింది అంటే అర్థం.. అంతకంటే ముందు నుంచే ఉందని. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. 1958లోనే ఇలాంటి వైరస్ బయటపడిందని చెబుతున్నారు. మరికొందరేమో.. 200 ఏళ్ల నుంచి, లేదూ 400 ఏళ్ల నుంచి ఉందంటున్నారు. నిజంగా అదో సాధారణ జలుబు, దగ్గు, జ్వరం అయితే.. ఇప్పుడే ఎందుకని ఇంత కంగారుపడాల్సి వస్తోందనేదే ప్రశ్న. చైనాలో HMPV విజృంభిస్తోంది కాబట్టి మనం కంగారు పడిపోవాలా? పోనీ, ఇన్నేళ్లుగా.. నిశ్శబ్దంగా ఉన్న ఈ వైరస్.. చైనాలో ఏదైనా మార్పు చెందిందా? వైరస్‌లు మ్యుటేషన్ జరగడం అనేది కామన్. కరోనా కూడా డెల్టా, ఒమిక్రాన్ అంటూ రూపాంతరం చెందింది. అలా ఏమైనా ఈ HMPV మారిందా అనేది డౌట్. పోనీ.. చైనా ఏమైనా ఈ వైరస్ గురించి డిటైల్స్ పంచుకుంటుందా అంటే.. ఐదేళ్ల క్రితం కరోనా మూలాలపై వివరాలు అడిగితేనే ఇవ్వలేదు, ఇప్పుడు అడిగితే మాత్రం ఇస్తుందా? సో, ఈ వైరస్.. మ్యుటేషన్ అయిన వైరస్సా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అందులోనూ.. డిసెంబర్‌లోనే ఈ HMPV కేసులు నమోదవుతూ వస్తున్నాయి చైనాలో. ప్రస్తుతం ఈ వైరస్ ఉధృతి చైనాలో విపరీతంగా పెరిగిపోయిందంటున్నారు. పైగా.. చైనాలో ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. హాలిడేస్ టైమ్ కూడా. సో, చైనాలో ఏ స్థాయిలో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నది ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. కొన్ని మీడియా హౌస్‌లు.. లేదా సోషల్ మీడియా పోస్టులను బట్టి తెలుస్తున్నదేంటంటే.. HMPV బాధితులతో చైనా హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి అని. అదే నిజం అయితే గనక.. చైనా నిజాలు దాస్తున్నట్టే అర్థం.
కరోనా ప్రపంచానికి అతిపెద్ద పాఠం నేర్పింది. కరోనా ఒక్కటే కాదు.. ఇకపై వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న హింట్ ఇచ్చింది. అందులో భాగంగా వైరల్ అవుతున్నదే.. ఈ HMPV వైరస్. నిజానికి ఈ వైరస్‌కు మందు లేదంటున్నారు గానీ.. మెడిసిన్ ఉంది. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తరువాత.
ప్రజలు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వైరస్ వ్యాపిస్తోందనో, అది చంపేస్తుందనో కాదు. మెడికల్ మాఫియా నుంచి కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్ ఇది. కరోనా సమయంలో ఎలాంటి దోపిడీ జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. పైగా ఈ వైరస్ కూడా చైనాలో పుట్టింది, చైనా నుంచే వచ్చిందనే అపోహలో ఉన్నారు చాలామంది. ఆ చైనా పేరు చెప్పి మెడికల్ మాఫియా విజృంభించే అవకాశం కూడా ఉంది. సో, జాగ్రత్తగా ఉండాల్సింది ఆ విషయంలో. కరోనాలో కొత్తరకం వేరియెంట్ వచ్చిందని బాగా హైప్ క్రియేట్ చేసి మరీ ఇష్టమొచ్చిన మందులు అమ్మేశారు. సో, మరోసారి అలాంటి వ్యాపారం చేయడానికి మెడికల్ మాఫియా కాచుకుని కూర్చుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం బీ-అలర్ట్. ఎందుకంటే.. ఈ HMPVకి ఎలాంటి చికిత్స చేయాలనేది ఇప్పటి వరకు గైడ్‌లైన్స్ లేవు. లక్షణాలు, పరిస్థితిని బట్టి ట్రీట్‌మెంట్ చేయడం మాత్రమే జరుగుతోంది. సో, ఫలానా టాబ్లెట్‌తో HMPV తగ్గుతోందనే మాటలు నమ్మొద్దు, మెడికల్ మాఫియా గుప్పిట్లో చిక్కుకోవద్దు.
నిజానికి వైరస్‌ను చంపే మందులు ఇప్పటి దాకా లేవు. మరి.. ఇప్పుడున్న మందులన్నీ ఏంటి? అవన్నీ వైరస్ వ్యాప్తి జరక్కుండా అడ్డుకట్ట వేసేందుకు మాత్రమే తీసుకొచ్చిన మందులు. వైరస్ ఎక్కడ ఉందో అక్కడికే పరిమితం చేసే మందులు అవన్నీ. మరి వైరస్‌ను చంపలేమా అంటే.. కచ్చితంగా అంతం చేయొచ్చు. దానికి మందు మనిషి శరీరంలోనే ఉంది. దాని పేరు ఇమ్యూనిటీ- రోగనిరోధక శక్తి. మనం తీసుకునే ఆహారమే.. ఆహారంపై పెట్టే ఖర్చే.. మనిషిని జబ్బుల నుంచి దూరం చేస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా లాంటి అలవాట్లు లేకుండా, నిద్ర, వ్యాయామం, మంచి లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేసే వారిలో ఈ ఇమ్యూనిటీ దండిగా ఉంటుంది. ఎలాంటి వైరస్‌నైనా చంపగలిగే శక్తి.. శరీరంలోని ఈ రోగనిరోధక శక్తికి ఉంది. అందులోనూ, హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. ఒకటే వైరస్ వందలు, వేలు, లక్షల మందికి సోకితే.. ఇక ఆ వైరస్ అంతం అయినట్టే అర్థం. పర్ సపోజ్.. కరోనానే తీసుకుందాం. ఇప్పుడు కరోనా వైరస్ లేదా అంటే.. ఉంది. ఇప్పటికీ మనిషి శరీరంలో బతికే ఉంది. కాని, మనలోని హెర్డ్ ఇమ్యూనిటీ.. కరోనా వైరస్ కాళ్లూ చేతులూ విరిచి మూలకు కూర్చోబెట్టింది. భవిష్యత్తులో ఎప్పుడు కరోనా వైరస్ శరీరంలోకి సోకినా సరే.. ‘ఇది వరకు వచ్చిన వైరస్‌వే కదూ నువ్వు’ అని గుర్తుపట్టి మరీ దాడి చేస్తుంది. అప్పట్లో కొవిడ్-19 కొత్త వైరస్ కావటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరంలో యాంటీబాడీస్ లాంటివి లేవు. ఇప్పుడు.. మనలోని ఇమ్యూనిటీ కరోనాను గుర్తుపట్టేస్తుంది. కరోనా వైరస్ సోకడం ఆలస్యం దానిపై అస్త్రశస్త్రాలూ ప్రయోగిస్తుంది మన శరీరం. ఎంతైనా ఈ ఇమ్యూనిటీకి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మరిచిపోదు. మనిషి శరీరంలో B-సెల్స్, T-సెల్స్ ఉంటాయి. ఇవి, వైరస్‌ను కలకాలం గుర్తుపెట్టుకుంటాయి. కాని, ఇక్కడే ఓ ప్రాబ్లమ్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు మనుషులు. బాడీలోని ఇమ్యూనిటీ.. వైరస్‌ను తొక్కిపెట్టినంత కాలం మనిషికి ఏం కాదు. ఎప్పుడైతే.. లైఫ్‌స్టైల్ మార్చి, చెడు అలవాట్ల దారి పడతారో అప్పుడు ఇమ్యూనిటీ తగ్గి.. వైరస్‌కు దారి ఇస్తుంది. అదే.. మనిషిని శ్మశానదారికి తీసుకెళ్తుంది.
ఇప్పుడు HMPV విషయానికే వద్దాం. ఈ వైరస్‌ను 2001లోనే గుర్తించారు. ఇప్పటికిప్పుడు ఇండియాలోని వాళ్లందరికీ HMPV టెస్టులు చేయిస్తే.. కరోనా కంటే ఎక్కువ మందిలో ఈ వైరస్ ఉన్నట్టు తేలుతుంది. తుమ్మితే, దగ్గితే వచ్చే వైరస్ కదా.. కచ్చితంగా అందరిలోనూ ఉంటుంది. మనిషిలో ఏ మూలనో అలా పడి ఉంటుంది. ఎందుకంటే.. వచ్చి పాతికేళ్లు అయిన వైరస్ కాబట్టి ఎప్పుడో అది ఎండెమిక్‌కి చేరుకుంది. అంటే.. అంతమయ్యే దశకు చేరుకుంది. ఏదైనా వైరస్ కొత్తగా పుట్టుకొచ్చి, అల్లకల్లోలం సృష్టిస్తే.. దాన్ని పాండెమిక్ అంటారు. ఏడాది రెండేళ్ల తరువాత.. అలా అల్లకల్లోలం సృష్టించిన వైరస్సే చాలా సాధారణ జబ్బులా మారిపోతుంది. అప్పుడు దాన్ని ఎండెమిక్ అంటారు. అచ్చం కరోనాలా అన్నమాట. ఇప్పుడు HMPV కూడా ఎండెమిక్‌గానే ఉందంటున్నారు. సో, ఊరికే భయపడిపోయి.. లేనిపోని భయాలు కొనితెచ్చుకుని.. స్ట్రెస్‌కు గురికావొద్దు. ఎప్పుడైతే, తెలియని ఆందోళన, భయాలకు గురవుతారో.. అప్పుడు వైరస్ మళ్లీ కోరలు చాస్తుంది. మనిషి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కరోనా కూడా.. తీవ్రంగా భయపడిపోయిన వారిలోనే చాలామందిని చంపేసింది. భయాందోళనలు లేకుండా, మంచి ఆహారం తీసుకుంటూ, వైరస్‌ను ఎదుర్కొన్న వాళ్లు కరోనా సమయంలో బతికారు.
బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ వైరస్ లక్షణాల గురించే. అందరికీ ఇవే లక్షణాలు ఉంటాయని చెప్పలేం గానీ.. సాధారణంగా అయితే.. ముక్కు కారడం, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు, దగ్గుతో పాటు గొంతునొప్పి, అటుఇటుగా 102 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఒళ్లునొప్పులు, తలనొప్పి, విపరీతమైన నీరసం ఉండడం సహజం. జాగ్రత్తగా గమనిస్తే.. కరోనాకు ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో.. సరిగ్గా అవే లక్షణాలతో ఉంటుంది ఈ HMPV వైరస్. అలాగని ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. మనకు తెలియని జలుబు, దగ్గు, జ్వరమా అని ఇష్టమొచ్చిన మందులు మింగితే ప్రమాదమే. ఎందుకంటే.. వైరల్ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ ఏమాత్రం పనిచేయవు. సో, డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి.
HMPVలో నాలుగు రకాలు ఉన్నాయి. A1, A2, B1, B2 రకాలు ఉన్నాయి. ఇవి కూడా కొత్తవేం కాదు. పైగా ఏమంత ప్రమాదకరమైన రకాలు కూడా కావు. కొన్నేళ్లుగా చూస్తున్న వైరస్సే ఇది. కాకపోతే.. మారిన కండీషన్స్ కారణంగా.. ఆ వైరస్‌కు ఇంకేదైనా బలం వచ్చి ప్రమాదకరంగా మారిందా అన్నదే అర్థం కావడం లేదు. వైరస్‌లో జన్యుపరంగా ఏమైనా మార్పులు జరిగి ఉండడమో.. శక్తిని పెంచుకుని మరింత ఉద్ధృతంగా మారి ఉండడమో జరిగి ఉంటే మాత్రం కాస్త ప్రమాదకరంగా మారే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికైతే.. అలాంటి లక్షణాలు కనిపించడం లేదు. సో, ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే లేదు. పైగా చిన్నపిల్లలకు వస్తోంది కదా అనే అనవసర భయాలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే.. కర్నాటకలో జనరల్ చెక్‌అప్‌లో భాగంగా చేసిన టెస్టుల్లో ఈ HMPV వైరస్ బయటపడింది. 3 నెలల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో.. ట్రీట్‌మెంట్ చేసి ఆ చిన్నారి కోలుకున్న తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బెంగళూరులో 8 నెలల వయసు ఉన్న మరో చిన్నారిలో కూడా ఈ HMPV వైరస్ ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం చాలా చక్కగా, పూర్తి ఆరోగ్యంతో ఉందీ ఆ చిన్నారి. ఇక గుజరాత్‌లో కూడా 2 నెలల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. రాజస్తాన్‌లో సైతం చిన్నారికే ఈ వైరస్ సోకింది. వీళ్లలో ఎవరూ సీరియస్‌గా లేరు. సో, భయపడాల్సింది కూడా ఏం లేదు. అందులోనూ వీళ్లకు వచ్చిన వైరస్.. చైనా నుంచి సంక్రమించింది కాదు. ఇక్కడ ఆల్రడీ ఉన్న వైరస్సే.. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోని వైరస్సే.. టెస్టుల్లో బయటపడింది. అంతే. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది. తట్టుకునేంత శక్తి శరీరానికి ఉంటే తొందరగానే తగ్గిపోతుంది. రోగనిరోధకశక్తి లేనప్పుడే.. కాస్త ఎక్కువ రోజులు శరీరంలో వైరస్ ఉంటుంది. అంతే తప్ప.. ప్రస్తుతానికైతే HMPVతో వచ్చిన ప్రమాదం ఏం లేదు. జస్ట్.. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష. కరోనా టైమ్‌లో మాస్కులు, శానిటైజర్లు వాడి, షేక్‌హ్యాండ్స్ ఇవ్వకుండా భౌతిక దూరం ఎలా అయితే పాటించామో ఇప్పుడూ అలాగే చేస్తే సరిపోతుంది.
ఫైనల్‌గా డాక్టర్లు చెబుతున్నదేంటంటే.. ఇది కరోనా అంతటి తీవ్రమైన వైరస్ అయితే కాదు. రక్తనాళాలను దెబ్బతీయటం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఇందులో ఉండవు. కాకపోతే.. న్యుమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గితే మాత్రం.. ఆసుపత్రిలో దానికి వేరే చికిత్స చేయాల్సి ఉంటుంది. సో, వైద్యులు, ప్రభుత్వాలు, ICMR చెబుతున్నట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఈ వైరస్‌కు భయపడాల్సి అవసరం లేదు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..