Pakistan: కొత్త సంవత్సరంలో పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. షాక్ ఇచ్చిన ఐసీసీ
SA vs PAK: కొత్త సంవత్సరంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో పాకిస్థాన్ జట్టు కోల్పోయింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. జట్టు ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది ఐసీసీ. దీంతో పాటు..
కొత్త సంవత్సరం (2025) పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అచ్చిరావడం లేదు. దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి ఢీలా పడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ క్రికెట్ జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ జరిమానా విధించింది. పాక్ జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించింది. దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 5 పాయింట్లను తగ్గించింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాక్ ఏకంగా 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాకిస్థాన్ జట్టు ఐదు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో మ్యాచ్ రిఫరీ రిచర్డ్‌సన్ పాక్ జట్టుకు జరిమానా విధించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ జరిమానాను అంగీకరించినట్లు ఐసీసీ పేర్కొంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు.. నిర్ణీత గడువులోగా బౌలింగ్ చేయనిపక్షంలో ఆ ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ పాయింట్లను కూడా తగ్గిస్తారు. ఇలా మొత్తం మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏకంగా 5 ఓవర్లు ఆలస్యంగా వేసినందువల్ల ఆటగాళ్లందరి మొత్తం ఫీజులో 25శాతం కోత విధించారు.
పాకిస్థాన్ జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ
Pakistan have been fined, and docked World Test Championship points owing to slow-over rate during Cape Town Test.#SAvPAK #WTC25https://t.co/jxF35Nk086
— ICC (@ICC) January 7, 2025
9వ స్థానంలో పాకిస్థాన్..
మరోవైపు డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో 35 పాయింట్లతో పాకిస్థాన్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. తదుపరి వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ ఆడనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జనవరి 16 నుంచి ప్రారంభంకానుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జనవరి 24 నుంచి జరగనుంది.