అమరావతితో ఆర్థిక నష్టం.. వందకు వందశాతం ‘నో’
వారం రోజులుగా ఎదురుచూస్తున్న బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ BCG రిపోర్ట్ ప్రభుత్వం చేతికి అందింది. ఏపీ అంతటా సమాన అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి.. అనే విధానమే ఈ రిపోర్ట్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం, గ్రీన్‌ఫీల్డ్ మెగాసిటీల వల్ల ప్రయోజనాలు, అందుకు పట్టే సమయం.. జిల్లాలు.. ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలు, వనరులు అన్నింటిపైనా అధ్యయనం చేసి.. తమ స్థాయిలో ఇలా చేస్తే బాగుంటుంది అని చెబుతూ.. పూర్తిస్థాయి నివేదికను అందించింది. ఒక్కమాటలో […]
వారం రోజులుగా ఎదురుచూస్తున్న బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ BCG రిపోర్ట్ ప్రభుత్వం చేతికి అందింది. ఏపీ అంతటా సమాన అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి.. అనే విధానమే ఈ రిపోర్ట్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం, గ్రీన్‌ఫీల్డ్ మెగాసిటీల వల్ల ప్రయోజనాలు, అందుకు పట్టే సమయం.. జిల్లాలు.. ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలు, వనరులు అన్నింటిపైనా అధ్యయనం చేసి.. తమ స్థాయిలో ఇలా చేస్తే బాగుంటుంది అని చెబుతూ.. పూర్తిస్థాయి నివేదికను అందించింది. ఒక్కమాటలో చెప్పాలంటే అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో సచివాలయం, కర్నూలులో హైకోర్టు అన్న మూడు మాటలే బీసీజీ రిపోర్ట్‌లోనూ ఉన్నాయి.
వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్యరంగం, ఆర్థికం అనే ఆరు ప్రాధాన్యతా అంశాలను పరిగణనలోకి తీసుకుంది BCG. అమరావతినే కొనసాగిస్తే ఎదురయ్యే పరిస్థితులు, ఇతర ప్రాంతాలను ఎంచుకోవడం వల్ల లాభాలను రిపోర్ట్‌లో పొందుపరిచింది. రాష్ట్రం వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే.. కొన్ని కీలక రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. అవి ఎక్కడ, ఎలా అన్న కోణంలోనూ కొన్ని సూచనలు చేసింది.
ప్రత్యేకించి, అమరావతిని రాజధానిగా ఉంచాలా వద్దా కోణంలో బీసీజీ రిపోర్ట్ చూస్తే.. వందకు వందశాతం నో చెప్పినట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీకి రెండు లక్షల 25వేల కోట్ల రూపాయల అప్పుంది. ఈ పరిస్థితుల్లో ముందుగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని నిర్మించాలంటే మరో లక్ష కోట్ల రూపాయలు కావాలి. కేవలం ఒక్క పట్టణానికే అంత ఖర్చు పెట్టడం రిస్క్‌గా చెప్పింది బీసీజీ రిపోర్ట్. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్.. అని చెబుతున్నారు. కానీ ప్రపంచంలో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కలలుగన్న దేశాలు, రాష్ట్రాలకు ఇప్పటికీ ఆటంకాలు ఎదురవుతున్నాయన్నది రిపోర్ట్. నిజానికి కొత్త పట్టణాల అభివృద్ధికి 30 నుంచి 60 ఏళ్ల సమయం పట్టొచ్చని భావించింది.
అమరావతి ప్రస్తుత జనాభా లక్షా 20వేలు. రానున్న 25ఏళ్లలో 60శాతం పెరుగుతుందని గత ప్రభుత్వం భావించింది. కానీ.. హాంకాంగ్, సింగపూర్ లాంటి చోట్ల కూడా జనాభా పెరుగుదల కేవలం 2 శాతమే ఉంటే.. అమరావతిలో 60శాతం ఎలా సాధ్యం అవుతుందన్నది BCG భావన. బహుళ రాజధానులను నమ్ముకున్న రాష్ట్రాలు, ప్రాంతాలు బాగుపడినట్లు చరిత్రలో లేవు.. అంటూ విపక్షాలు వాదిస్తుంటే, దాన్ని తప్పుగా చెప్పింది బీసీజీ. దక్షిణాఫ్రికా ఫెయిల్యూర్ మోడల్ కావచ్చుగానీ, జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు ఒకటి కంటే ఎక్కువ రాజధానులతో అభివృద్ధి సాధించినట్లు చెప్పింది. అక్కడ ప్రభుత్వ సంస్థలు, పౌరుల మధ్య సమన్వయం బాగుందని, తద్వారా మేలు జరుగుతోందని సూచించింది. టోటల్‌గా అమరావతికే పరిమితమై అనర్థం, రాజధానుల విభజనతోనే అభివృద్ధిగా బీసీజీ సూచించింది.