Los Angeles wildfires: లాస్‌ఏంజెలెస్‌లో వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు.. 16కు పెరిగిన మృతుల సంఖ్య

అక్కడ అణుబాంబు పడలేదు..కానీ అంతకు మించిన వినాశనం కనిస్తోంది. ప్రపంచం అంతం అంటూ జరిగితే..అది ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. బాంబు దాడులకు శిథిలమైన ప్రాంతాన్ని తలపిస్తోంది..అమెరికాలో లాస్‌ ఏంజెలెస్‌ నగరం. ఎటు చూసినా కార్చిచ్చు..ఆ ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్ని వైపుల నుండి కమ్ముకొస్తున్న అగ్నికీలలు..ఇక భవిష్యత్తు లేదన్నట్టుగా అక్కడి ప్రజలను భయపెడుతున్నాయి..

Los Angeles wildfires: లాస్‌ఏంజెలెస్‌లో వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు.. 16కు పెరిగిన మృతుల సంఖ్య
Los Angeles Wildfire
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 12:34 AM

ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్‌ ఏంజెలెస్‌ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు కనిపిస్తున్నాయి. అంతరిక్షం నుండి సైతం ఈ కార్చిచ్చు విధ్వంసం కనిపిస్తోందంటే..ఈ వినాశనం ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. GFX: పసిఫిక్‌ తీరప్రాంతం నుంచి పాసడేనా ఐదు ప్రాంతాల్లో కార్చిచ్చు V.O..3 వర్షాలు పడక ఎండిపోయిన అటవీప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చిబూడిద చేస్తోంది. పసిఫిక్‌ తీరప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో రాజుగున్న అగ్గి..వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వేలఇళ్లు, కార్యాలయాలు, షాపులు నిర్మాణాలను భస్మీపటం చేస్తోంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా విస్తరిస్తున్నాయి.

మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఇప్పటికే వేల భవనాలను కూల్చేసి..పదుల ప్రాణాలను బలితీసుకున్న కార్చిచ్చు చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటం ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఇప్పటిదాకా దాదాపు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. విలువైన వస్తువుల కంటే తమ ప్రాణాలు ముఖ్యమనుకుంటూ కట్టుబట్టలతో జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో ఇదే అదనుగా దొంగల ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆ ఇళ్లల్లో విలువైన వస్తువులను దోచుకుంటున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి పహారా కాస్తున్నారు..పోలీసులు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడుపుతున్నాయి. పొగచూరిన వాతావరణంలో ఊపిరిపీల్చేందుకు లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు..అధికారులు.

జనవరి 17న జరగాల్సిన ఆస్కార్‌ నామినేషన్లు 19కు వాయిదా

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా..కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెలెస్‌కు పేరుంది. హాలీవుడ్‌ సెలబ్రెటీలు, ప్రపంచ ధనవంతులు ఉండేది ఇక్కడే. అలాంటి ప్రాంతం ఇప్పుడు మరుభూమిగా మారింది. ఎటు చూసినా కార్చిచ్చు.. దాని ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. మొన్నటివరకూ సంపదలతో తులతూగిన లాస్‌ ఏంజెలెస్‌ నగరం.. కార్చిచ్చుతో మరుభూమిని తలపిస్తోంది. భీకర మంటల భయంతో పలు హాలీవుడ్‌ స్టూడియోలు మూతపడ్డాయి. యూనివర్సల్‌ స్టూడియోస్‌ తమ థీమ్‌ పార్క్‌ను మూసేసింది. కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక..ఆస్కార్‌ అవార్డులనూ తాకింది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్‌ నామినేషన్లను..19కు వాయిదా వేశారు.

సుమారు రూ.12లక్షల కోట్లకు పైగా నష్టం

ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ కార్చిచ్చు.. చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలగజేసిన కార్చిచ్చుగా ఇది మిగిలిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు రూ.12లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ 13 వేల నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జేపీ మోర్గాన్‌, మార్నింగ్‌ స్టార్‌ అంచనాల ప్రకారం 20 బిలియన్‌ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్‌ ఫామ్‌ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది.

పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నా..తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇది బ్రెంట్‌వుడ్‌ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్‌ జేమ్స్‌, ఆర్నాల్డ్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ నివాసాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులతో తన చిట్టచివరి అధికారిక విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు..కమలా హారిస్‌. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌కు చెందిన ఇంటినీ కార్చిచ్చు దహించివేసింది. మరోవైపు తన చిట్టచివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్దామనుకున్న బైడెన్‌ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు.

సరిపడినంత నీళ్లు లేకపోవడం ఫైర్‌ఫైటర్స్ అవస్థలు

రోజులు గడుస్తున్నా…లాస్‌ ఏంజెలెస్‌లోని కార్చిచ్చులను అదుపు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిపడినంత నీళ్లు లేకపోవడం ఇందుకు కీలక కారణమని చెబుతున్నారు..ఫైర్‌ ఫైటర్స్‌. హాలీవుడ్‌ స్టార్లు లాస్‌ఏంజెలెస్‌లో జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో..ఇప్పుడు వేల ఇళ్లను మంటల బారి నుంచి కాపాడేందుకు నీటి కొరత ఎదురవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీస్థాయిలో విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు..విమానాలు రంగంలోకి దిగుతాయి.అయితే గాలులు విపరీతంగా వీస్తుండడంతో పలుచోట్ల విమాన సేవలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది.

డెల్టా స్మెల్ట్‌ చేపజాతిని కాపాడేందుకు కాలిఫోర్నియా గవర్నర్‌ ప్రయత్నం

ఈ కార్చిచ్చు..రాజకీయంగానూ చిచ్చుపెడుతోంది. డెల్టా స్మెల్ట్‌ అనే చేపజాతిని కాపాడటానికి కాలిఫోర్నియా గవర్నర్‌ చేసిన తప్పిదం వల్లే ప్రస్తుతం ఈ కార్చిచ్చును అరికట్టడం కష్టమవుతోందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ విమర్శించారు. ఆ చేపలు తక్కువ నీటిలోనే మనుగడ సాధిస్తాయన్న ఆలోచనతో జల వనరుల పునరుద్ధరణ ఒప్పందంపై సంతకం చేయడానికి గవిన్‌ తిరస్కరించారని.. లేకపోతే కాలిఫోర్నియాకు పెద్ద ఎత్తున జలాలు వచ్చేవని మండిపడ్డారు..ట్రంప్‌. మరోవైపు మానవ తప్పిదాలే ఇలాంటి విపత్తులకు కారణమవుతున్నాయని చెబుతున్నారు.

కార్చిచ్చులు ఓవైపు కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తుంటే..దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఒక్లహోమా రాష్ట్రాలను మంచు తుపాను వణికిస్తోంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో చాలా ప్రాంతాల్లో భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. విమాన సేవలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది. మంచు తుపానుతో జనజీనవం స్తంభిస్తోంది. మరోవైపు అర్కన్సాస్, జార్జియా, టెన్నెస్సీ, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లూసియానా, మిసిసిపీ, అలబామా రాష్ట్రాల్లో మంచు తుపానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ విపత్తుల నుండి అగ్రరాజ్యం ఎప్పటికి కోలుకుంటుందో చూడాలి.