Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం

భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. అవును బంగ్లాదేశ్‌ వైఖరి మారింది. పాక్‌తో స్నేహాన్ని బలపరుచుకుంటుంది. ఒకప్పుడు పాకిస్థాన్ చెర నుంచి విడిపోవడానికి యుద్ధమే చేసిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే పాకిస్థాన్ స్నేహం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకుంది బంగ్లా ప్రభుత్వం. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...

Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం
Pakistan PM Sharif Bangladesh leader Yunus
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 12:59 AM

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ ప్రాధాన్యతలు మారిపోయాయి. విదేశాంగ విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్‌తో స్నేహపూర్వక వైఖరితో ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు శత్రువుగా భావిస్తూ పాకిస్థాన్ పంచన చేరుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాలల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. పాకిస్థాన్ దోస్తీ కోసం ఎంత చేయాలో, ఏమేం చేయాలో అంతా చేస్తోంది. తాజాగా ఆ దేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కారు మరింత సులభతరం చేశారు. పాకిస్థాన్ రాయబారులు, ఉన్నతాధికారులకు వీసాలు జారీ చేసే సమయంలో ఢాకా నుంచి ప్రత్యేక క్లియరెన్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఆ క్లియరెన్స్‌లు ఏవీ అవసరం లేకుండా నేరుగా వీసాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ ఇక్బాల్ హుస్సేన్.. లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యాపార వర్గాలకు వెల్లడించారు.

పాకిస్థాన్‌తో సత్సంబంధాల కోసం యూనస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్బాల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకొంటున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్, సరకు రవాణా నౌకలు చేరుకున్నాయి. షేక్ హసీనా సర్కారు ఉన్న సమయంలో పాక్ నుంచి వచ్చే కార్గో షిప్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించింది యూనస్ సర్కారు. దీని వల్ల కార్గో తరలింపు సులభమైంది. అయితే సరకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరోవైపు రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు ​​పంపింది. సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం కాల్పులు జరిపిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటన తర్వాత సరిహద్దులో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..