Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందూ వ్యక్తుల హత్య.. భారత్ మాస్ వార్నింగ్!
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆ దేశం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ఇటీవల హిందువలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తొలుత దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహానికి నిప్పంటించిన ఘటన మురువకముందే తాజాగా మరో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన జరిగింది..

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆ దేశం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ఇటీవల హిందువలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తొలుత దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహానికి నిప్పంటించిన ఘటన మురువకముందే తాజాగా మరో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన జరిగింది. అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే వ్యక్తి రాజ్‌బరిలోని పంగ్షా ఉప జిల్లాలో హత్యకు గురయ్యాడు. సామ్రాట్ హత్య ఏ విధంగానూ మతపరమైనది కాదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే హిందువులపై జరుగుతున్న వరుస దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన వరుస సంఘటనలను ఆందోళన కలిగించేవిగా అభివర్ణించింది. హిందువులపై ఇలాంటి హింసను విస్మరించలేమని భారత్ హెచ్చరించింది. సరిహద్దు వెంబడి జరుగుతున్న పరిణామాలను న్యూఢిల్లీ తీవ్రంగా పరిగణించిందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం అన్నారు. హిందువులపై జరుగుతున్న హింసను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. బాధ్యులను గుర్తించి శిక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్‌లో ఇటీవలి పరిణామాల గురించి మనందరికీ తెలుసు. మేము వాటిని నిశితంగా గమనిస్తున్నాం. శాంతిభద్రతల పరిస్థితి విషయానికొస్తే అక్కడ ఏం జరుగుతుందో మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగించే విషయమని జైస్వాల్ అన్నారు. మైమెన్‌సింగ్‌లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను ఖండిస్తున్నామని అన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆశిస్తున్నాం. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హత్యలు, దహనాలు, భూ కబ్జాలతో సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు జరిగినట్లు స్వతంత్ర వర్గాలు నమోదు చేశాయి. ఈ సంఘటనలను కేవలం రాజకీయ హింసగా తోసిపుచ్చలేమని అన్నారు. బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందూ వ్యక్తులను కొట్టి చంపిన నేపథ్యంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగిందంటే..
బంగ్లాదేశ్‌లోని స్థానిక మీడియా ప్రకారం.. రాజ్‌బరిలో బుధవారం ఢాకాకు పశ్చిమాన 145 కి.మీ దూరంలో ఉన్న రాజ్‌బరి పట్టణంలోని పంగ్షాలో జరిగింది. అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ (29) ‘సామ్రాట్ బాహిని’ అనే క్రిమినల్ ముఠాకు చెందిన నాయకుడు. గత సంవత్సరం షేక్ హసీనా బహిష్కరణ తర్వాత సామ్రాట్ దేశం విడిచి పారిపోయి ఇటీవలే కలిమోహోర్ యూనియన్‌లోని తన గ్రామం హోసెండంగాకు తిరిగి వచ్చాడు. అతడు, అతని ముఠా బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రాజ్‌బరిలోని పంగ్షాలో షాహిదుల్ ఇస్లాం అనే స్థానికుడి ఇంటికి డబ్బు వసూలు చేయడానికి వెళ్లారు. అయితే అతడి కుటుంబ సభ్యులు ఈ ముఠాను చూసి దొంగలని భావించి అరవడం ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు సామ్రాట్‌ను పట్టుకుని కొట్టి చంపారు. అయితే ముఠాలోని ఇతర సభ్యులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సామ్రాట్‌ను ఆ గుంపు నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు దృవీకరించారని పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ దేబ్రత సర్కార్ మీడియాకు తెలిపారు. పాంగ్షా పోలీస్ స్టేషన్‌లో సామ్రాట్‌పై మోండల్‌పై హత్య కేసుతో సహా ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయని సర్కార్ తెలిపారు.
ఆ తరువాత మోండల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం రాజ్‌బరి సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత అతని సహచరులు పరారయ్యారు. ఇందులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనీసం రెండు కేసులు నమోదయ్యాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితమే రాజ్‌బరిలో దీపు దాస్ అనే మరో వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. ఇతడు ఓ ఫ్యాక్టరీ కార్మికుడు. దైవదూషణ ఆరోపణలపై అతనిపై గురువారం రాత్రి ఒక గుంపు కొట్టి చంపింది. ఆ తరువాత అతన్ని చెట్టుకు ఉరితీశారు. హత్య తర్వాత, జనం అతని మృతదేహాన్ని ఢాకా-మైమెన్‌సింగ్ హైవే పక్కన పడేసి నిప్పంటించారు. దీనితో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ హత్యాకాండకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ప్రజాగ్రహానికి, ఆందోళనను కారణమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




