Central Government: న్యూ ఇయర్ వేళ దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త కార్యక్రమం.. అత్యంత చవకకే..
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. భారత్ ట్యాక్సీ పేరుతో క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలోని ప్రధాన సిటీల్లో ఈ సేవలు ప్రవేశపెట్టనున్నారు. బైక్, ఆటో, కారు బుకింగ్స్ దీని ద్వారా చేసుకునే సదుపాయం రానుంది. దీని గురించి పూర్తి వివరాలు..

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. జనవరి 1వ తేదీన లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దేశ ప్రజలు తక్కువ ధరకే తమ గమ్యస్థానాలకు ప్రయాణం చేసే సౌకర్యం లభించనుంది. ప్రైవేట్ క్యాబ్ యాప్‌లు అధిక ధరలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. వర్షం పడే సమయం, ఉదయం లేదా సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఛార్జీలను మరింత పెంచుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అధిక మొత్తంలో చెల్లించి వీటిని బుక్ చేసుకుంటున్నారు.
భారత్ ట్యాక్సీ యాప్ ఎలా పనిచేస్తుంది
భారత్ ట్యాక్సీ యాప్ రాకతో దేశంలోని ప్రజలు తక్కువ ధరకే ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతారు. ప్రైవేట్ సర్వీసులో పోలిస్తే ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయించేవారికి డబ్బులు భారీగా ఆదా అవ్వనున్నాయి. భారత్ ట్యాక్సీ యాప్‌లో బైక్, ఆటో, కారు బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ యాప్‌ల తరహాలోనే ఇందులోనూ డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలకు సేవలు అందించవచ్చు. దీని వల్ల రైడర్లకు కూడా ఆదాయం లభించనుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ సేవలను ప్రారంభించగా.. సక్సెస్ అయింది. దీంతో జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం ప్రారంభించనుంది.
భారత్ ట్యాక్సీతో ప్రయోజనాలు
ప్రైవేట్ యాప్స్‌లో రైడ్‌ను బుక్ చేసుకున్న తర్వాత పలుమార్లు రైడర్లు రద్దు చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు డ్రైవర్లు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల రైడ్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎక్కువమంది డ్రైవర్లు బుక్ చేసుకునేలా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. దీని వల్ల ఎక్కువమంది రిజిస్టర్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు బుకింగ్ వెంటనే అవుతుంది. తక్కువ ధరకే సేవలు అందించడంతో పాటు యాప్‌ను సజావుగా నడిపిస్తే కేంద్ర ప్రభుత్వంలోని భారత్ ట్యాక్సీ యాప్ ప్రైవేట్ కంపెనీలకు పోటీ ఇవ్వడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డ్రైవర్లకు కూడా ఎక్కువ బుకింగ్స్ వచ్చి సంపాదన పెరిగితే యాప్ మరింతగా ప్రజల్లోకి వెళ్లనుంది. ఇదే జరిగితే ప్రైవేట్ కంపెనీల క్యాబ్ సర్వీసులను పక్కన పెట్టి ఈ యాప్‌ను ఎక్కువమంది ప్రజలు వాడే అవకాశముంది. జనవరి 1 నుంచి ప్రధాన నగరాల్లో ఈ యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ యాప్ ఎంతవరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందనేది వేచి చూడాలి.
