Polavaram: పోలవరం పురోగతిలో కీలక పరిణామం.. ఆ దిశగా చకచకా అడుగులు
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. రేపోమాపో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం షురూ కాబాతోంది. ఆలోగా.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు సాధకబాధకాలపై అధ్యయనం చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వబోతోంది.
పోలవరం ప్రాజెక్టు పురోగతిలో మరో చాప్టర్ షురూ ఐంది. నీటివనరులపై అధ్యయనం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. శనివారం పోలవరం ప్రాజెక్టుకు టూరేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత ప్రోగ్రెస్ ఏంటి.. పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. నిధుల లభ్యత ఏంటి.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా ఎప్పుడు.. ఇలా పోలవరంపై పూర్తి అధ్యయనం జరపనుంది స్టాండింగ్ కమిటీ. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, స్పిల్ వే, ఛానల్స్.. ఇలా అన్ని కీలక నిర్మాణాలను పరిశీలించబోతోంది.
రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బాలరాజు కూడా ఉన్నారు. తర్వాత రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను కమిటీకి వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏపీకి జీవనాడి అనుకున్న పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని, నిర్మాణంలో పురోగతి లేక 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని వాపోయారు మంత్రి నిమ్మల.
ఏడేళ్ల కిందట నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడు మరో 830 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఏడాదిలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తామని హామీ ఇస్తోంది. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన.. పోలవరం నిర్మాణంలో కీలక ముందడుగు. ఈ టూర్‌లో భాగంగా.. ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో సమావేశమై నిర్మాణ తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్ట్ పనుల జాప్యానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తారు. ఈ పర్యటన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనుల పురోగతి, సవాళ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.
ఐదేళ్ల కిందట వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ని ఇటీవలే అంతర్జాతీయ నిఫుణుల కమిటీ పరిశీలించింది. వారి సిఫార్సుల మేరకు 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సంకల్పించింది కూటమి ప్రభుత్వం. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏ తరహా కాంక్రీట్ మిక్చర్ వాడాలన్న అంశంపై ఇప్పటికే పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, డిజైన్ కన్సల్టెన్సీ, తిరుపతి ఐఐటీ నిపుణులు ఒక నిర్ణయానికొచ్చారు. దీనిపై కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆరా తీస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభం కోసం ముహూర్తం పెట్టుకున్న కూటమి సర్కార్.. కేంద్ర జలసంఘం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..