పాత వైరస్..కొత్త టెన్షన్..మళ్లీ అదే సీన్ కనిపిస్తుందా?
మళ్లీ అదే భయం. అదే బాధ. ఎప్పుడు ఎక్కడి నుంచి వైరస్ అటాక్ చేస్తుందోనన్న టెన్షన్ మొదలైంది. చైనాలో మొదలైన HMPV వ్యాప్తి..మన వరకూ వచ్చేసింది. ఇప్పటికే భారత్‌లో దాదాపు ఏడు కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటకలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే...ఈ వైరస్ వ్యాప్తి చైనాలో మొదలైనప్పుడు భారత్‌కి పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, అసలు అది ఇక్కడి వరకూ వచ్చే అవకాశమే లేదనుకున్నారు. కానీ..వరుస పెట్టి కొద్ది గంటల వ్యవధిలోనే బాధితుల సంఖ్య పెరిగింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది సాధారణ వైరస్ అని తేల్చి చెప్పారు. కానీ…ఎక్కడో ఓ మూల భయం మాత్రం పోవడం లేదు. ఏం జరుగుతుందో అని గుబులు అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే..రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే..ముందుగా కర్ణాటకలో తొలి HMPV కేసు నమోదైంది. ఆ తరవాత వెంటనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఫలితంగా..ప్రభుత్వం అలెర్ట్ అయింది. కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఇకపై ఎవరు బయటకు వచ్చినా కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. దీంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వెల్లడించింది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలతో వైరస్‌ని కట్టడి చేయొచ్చని తెలిపింది. ఇదే సమయంలో కర్ణాటకలోని స్కూల్స్ కూడా అలెర్ట్ అయ్యాయి. జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్ని స్కూల్‌కి పంపొద్దని తల్లిదండ్రులకు యాజమాన్యాలు మెసేజ్‌లు పంపుతున్నాయి. స్కూల్‌లో ఎవరైనా అనారోగ్యంగా కనిపించినా వెంటనే పేరెంట్స్‌కి ఇన్‌ఫామ్ చేస్తున్నాయి.