Sankranti: ఏపీలో కత్తులు దూస్తున్న కోళ్లు… గోదావరి జిల్లాల్లో పందాల హడావిడి

చుట్టూ కోలాహలం.. నరాలు తెగే ఉత్కంఠ.. జబ్బలు చరుచుకుంటూ, తొడలు కొట్టుకుంటూ.. పరువు కోసం పడే ఆరాటాలు.. లక్షలు, కోట్లు పోయినా పర్లేదు కానీ అందరిలో గెలిచే తీరాలన్న కసి. ఇవన్నీ చూస్తుంటే ఏదో భయానకమైన పోరాటం జరుగుతుందని మీరనుకోవచ్చు. యస్‌..! పోరాటమే, కానీ మనుషుల మధ్య కాదు.. కోళ్ల మధ్య. సంక్రాంతి వచ్చిందంటే తెలుగునాట కనిపించే కోడి పుంజుల కదన రంగం. కోట్లాది రూపాయలతో ముడిపడిన పందెం.

Sankranti: ఏపీలో కత్తులు దూస్తున్న కోళ్లు... గోదావరి జిల్లాల్లో పందాల హడావిడి
Cockfighting
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 12:33 AM

సంక్రాంతి సంబరాలకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తీసుకొస్తాయి ఈ పందాలు. ప్రభుత్వ అనుమతి లేకున్నా సంప్రదాయంలో భాగంగా ఏటా కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఈసారి సంక్రాంతికి ఒక్కరోజు ముందే పునకాలు లోడ్‌ అయ్యాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ బ్యాచ్‌ మొత్తం ఊళ్లలోకి దిగిపోయింది. కోడింగ్ పక్కకుపెట్టేసి.. కోళ్ల చుట్టూ చేరారు. కంపెనీలు, కర్మాగారాలు, సొంత బిజినెస్‌లు అన్నీ క్లోజ్‌.. ఉపాధి కోసం పట్నం బాటపట్టిన వాళ్లంతా తిరిగి ఊళ్లకు వచ్చి బరుల దగ్గర సందడి చేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర షురూ అయింది. మనల్నెవడ్రా ఆపేది.. అంటూ కత్తులు కట్టుకుని కాలుదువ్వుతున్నాయి పందెం కోళ్లు. వందలు వేలు దాటి లక్షల్లో బెట్టింగులు కాస్తూ రెచ్చిపోతున్నారు పందెంరాయుళ్లు.
ఒక పక్క పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నా లైట్ తీసుకుంటున్నారు పందెం నిర్వాహుకులు. ఇప్పటికే 10 వేలకు 20వేలు.. 50వేలకు లక్ష.. లక్షకు రెండు లక్షలంటూ పందెం రేట్లు కూడా ఫిక్స్‌ చేశారు నిర్వాహకులు. ఇక ఎక్కువ పందాలు గెలిచినవారికి ఆకర్షనీయమైన బహుమతులు కూడా ఇస్తామంటున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే ఖరీదైన బహుమతులు ప్రకటించారు. ఎక్కువ పందాలు గెలిచినవారికి బుల్లెట్, బైక్ , రెండు కాసుల బంగారం బహుమతిగా అందించనున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బరులు సిద్ధం చేసిన నిర్వాహకులు… ఈసారి మరింత స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారు. కోడి పందాలతో పాటు మహిళలకు కూడా భిన్నరకాల పోటీలు ఉంటాయని అంటున్నారు. ఇక భీమవరంలో క్రికెట్‌ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేస్తున్నారు. అరేంజ్‌మెంట్స్‌ కూడా నెక్ట్స్‌ లెవల్‌లోనే ఉన్నాయి. దీంతో అందరి చూపు భీమవరం జరిగినే కోడి పందాలపైనే ఉంది. దీంతో భీమవరంలో నెల రోజుల క్రితమే హోటల్స్‌ ఫుల్ అయిపోయాయి. అప్పు అయినా దొరుకుతుందేమో గానీ… హోటల్స్‌లో రూము దొరకడం మాత్రం కష్టంగా ఉందంటే సిచ్యూవేషన్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 మొత్తంగా ఈ మూడు రోజులూ పందెం రాయుళ్లదే హవా. వీళ్ల హడావుడి ఈ రేంజ్‌లో ఉంటే… పోలీసులు కూడా ఈసారి తమ పవర్‌ చూపించడారికి రెడీ అవుతున్నారు. కాకపోతే… కోడిపుంజులకు వెనుక ఖద్దరు చొక్కాలున్నాయ్ కనుక.. ఈ సారి పండక్కి కూడా పుంజుమారాజుదే రాజ్యం కాబోతుంది.