Nagamani: ఇది దగ్గరుంటే దుష్టశక్తులు దూరం.. రోగాలు నయం!.. నాగమణికి ఉండే పవర్స్ నిజమేనా?
తరతరాలుగా కథలు, పురాణాలు, సినిమాల్లో వినిపిస్తూ, ప్రజల మనసులను ఆకర్షిస్తున్న నాగమణి నిజంగానే ఉంటుందా? పాముల తలపై మెరుస్తుందని చెప్పే ఈ మాయారత్నం వెనుక ఉన్న వాస్తవమెంత? దైవిక శక్తులు, అదృష్టాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకాలు ఎంతవరకు నిజం? నాగమణి గురించిన పురాతన కథలకు, ఆధునిక సైన్స్ ఇచ్చే వివరణకు మధ్య ఉన్న భేదాన్ని ఈ కథనంలో పరిశీలిద్దాం.

నాగమణి” లేదా “స్నేక్ పెర్ల్” అనే పేరు విన్నప్పుడు, అలాంటి అద్భుతమైన వస్తువు నిజంగా ఉందా అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. శతాబ్దాల తరబడి, ముఖ్యంగా దక్షిణాసియాలో, నాగమణి గురించి అనేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. పాముల తలల్లో, ముఖ్యంగా నాగుపాముల తలల్లో కనిపించే అరుదైన, మెరిసే రత్నం అని చెప్పే ఈ వస్తువు, దైవిక శక్తి, రక్షణ, అదృష్టంతో ముడిపడి ఉందని నమ్ముతారు. పురాణాలు, సినిమాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, శాస్త్రీయ పరిశోధకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.
నాగమణి అంటే ఏమిటి? “నాగ” అంటే పాము, “మణి” అంటే రత్నం అని అర్థం వచ్చే సంస్కృత పదాల నుండి నాగమణి అనే పదం వచ్చింది. హిందువుల నమ్మకం ప్రకారం, ఈ రహస్యమైన రత్నం విషపూరితమైన పాముల తలలలో, ముఖ్యంగా నాగుపాములలో ఉంటుందని చెబుతారు. ఇది చీకట్లో మెరుస్తుందని, దానిని కలిగి ఉన్నవారికి అపారమైన ఆధ్యాత్మిక, భౌతిక శక్తులను ప్రసాదిస్తుందని, దుష్ట శక్తుల నుండి రక్షణ, రోగాలను నయం చేసే శక్తులు,అదృష్టాన్ని తెస్తుందని పురాణాలలో పేర్కొన్నారు.
నాగమణులు నిజంగా ఉంటాయా? “జియాలజీ ఇన్” ప్రకారం, నాగుపాములకు తలలలో మెరిసే నాగమణి అనే రత్నం ఉంటుందనే ఆలోచన భారతదేశం, ఆగ్నేయాసియా అంతటా ప్రజలను ఆకర్షించింది. అయితే, ఆధునిక సైన్స్ ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తుంది. జీవశాస్త్రపరంగా, నత్తలు వంటి మొలస్క్‌లకు భిన్నంగా, పాములకు ముత్యాలను ఏర్పరచే శరీర నిర్మాణ సామర్థ్యం లేదు. నాగమణులు అని పిలిచే వీటిని పిత్తాశయ రాళ్ళు లేదా గడ్డలు అని వారు చెబుతున్నారు. నిజమైన రత్నాలు కావని అంటున్నారు. ఇవి పాముల శరీరంలో ఏర్పడవచ్చు. కానీ వాటికి ఎటువంటి అతీంద్రియ శక్తులు లేవు. నాగమణి గురించిన ఈ పురాణం శాస్త్రీయ వాస్తవం కంటే సంస్కృతిక ప్రతీకవాదం, జానపద కథల నుండి ఎక్కువగా ఉద్భవించింది.
నాగమణి వెనుక పురాణ గాథలు: హిందూ పురాణాలు, ప్రాంతీయ జానపద కథలలో, పాములు కేవలం సరీసృపాలు కావు – అవి దైవిక జీవులు. నాగులను పూజిస్తారు. వాటిలో విశ్వ రహస్యాలు ఉంటారని నమ్ముతారు. నాగమణిని నాగులు కాపలా కాసే రత్నంగా చెబుతారు. తమ భక్తికి బహుమతిగా ఒక పాము నుండి నాగమణిని సాధువులు పొందే కథలు తరచుగా వింటుంటాం. దేవాలయాలలో, పౌరాణిక గ్రంథాలలో, బాలీవుడ్ చిత్రాలలో కూడా ఇది దైవిక, మెరిసే, అపారమైన శక్తి కలిగిన రత్నంగా చిత్రీకరించారు.
నాగమణిపై ఎందుకు నమ్మకం? అనేక సంస్కృతులలో, పాములు రక్షణ, జ్ఞానం, రహస్య శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. ‘నాగిన్’ వంటి సినిమాలు, టీవీ కార్యక్రమాలు సంచలనం సృష్టించాయి. మౌఖిక సంప్రదాయాల ద్వారా, ముఖ్యంగా గ్రామీణ భారతదేశం, ఆగ్నేయాసియాలో నాగమణికి సంబంధించిన పురాణ గాథలు కొనసాగుతూ వస్తున్నాయి. నాగమణులు చీకట్లో మెరుస్తాయని, విషాన్ని గుర్తించగలవని, మానసిక స్థితి లేదా ప్రమాదాన్ని బట్టి రంగు మారగలవని, శారీరక లేదా ఆధ్యాత్మిక రుగ్మతలను నయం చేయగలవని, సంపదను లేదా అదృష్టాన్ని ఆకర్షించగలవని నమ్ముతారు. కొందరు నాగమణిని కలిగి ఉండటం వల్ల అమరత్వం వస్తుందని లేదా దైవిక శక్తులతో సంభాషించవచ్చని విశ్వసిస్తారు.
ఆధునిక సైన్స్ ఎందుకు ఖండించింది? ఆధునిక హెర్పెటాలజిస్టులు, రత్న శాస్త్రజ్ఞులు ఒక విషయంలో ఏకీభవిస్తారు. పాము తల లోపల ముత్యం ఉనికికి ఎటువంటి జీవసంబంధమైన ప్రక్రియ మద్దతు ఇవ్వదు. నత్తలకు భిన్నంగా, పాములకు ముత్యాలను ఉత్పత్తి చేసే శరీరం ఉండదు. నాగమణులుగా పిలిచే కొన్ని పాములను శాస్త్రవేత్తలు పరిశీలించగా అవి పిత్తాశయ రాళ్ళు లేదా కిడ్నీ స్టోన్స్ వంటివి అని తేలింది. ఇవి పాము శరీరం లోపల సహజంగా ఏర్పడవచ్చు. కానీ వాటికి ఎటువంటి మాయా శక్తులు ఉండవు. నాగమణుల నమూనాలను విశ్లేషించగా, అవి సేంద్రియ పదార్థం, కాల్షియం, ప్రొటీన్ మిశ్రమాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు. అయితే ఏవీ శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం రత్నాలు లేదా ముత్యాలుగా అర్హత పొందలేదు




