శనగలతో స్పెషల్ పులావ్ రెసిపీ.. ఇలా చేస్తే టేస్ట్ కిరాక్ ఉంటది..!
బయట వర్షం కురుస్తుంటే ఇంట్లో ఏదైనా వేడివేడిగా.. కమ్మగా తినాలనిపిస్తుందా..? ఎప్పుడూ చేసే రొటీన్ రైస్ రెసిపీలకు భిన్నంగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా..? కానీ ఇంట్లో కూరగాయలు లేక ఏం చేయాలో అర్థం కావట్లేదా..? అలాంటప్పుడు ఈ స్పెషల్ శెనగల పులావ్ రెసిపీని ట్రై చేయండి.

పులావ్ వాసన వచ్చిందంటే చాలు.. ఎవరైనా తినకుండా ఉండలేరు. పులావ్ లకు ఎన్నో వెరైటీలు ఉన్నా.. ఈరోజు మనం కూరగాయలు ఏవీ లేకుండా కేవలం తెల్ల శెనగలు ఉపయోగించి పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. శెనగలు ప్రోటీన్ పవర్ హౌస్ కావడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం..? ఇప్పుడు శెనగలతో పులావ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- బాస్మతి రైస్ – 2 కప్పులు
- తెల్ల శెనగలు – 1 కప్పు
- ఉల్లిపాయ – 1 (సన్నగా నూడుల్స్ లా తరిగినది)
- టమోటా – 1 (చిన్న ముక్కలుగా తరిగినది)
- పచ్చిమిర్చి – 2
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క
- లవంగాలు – 3
- యాలకులు – 2
- అనాసపువ్వు – 1
- మిరియాలు – 5
- సోంపు – 1 స్పూన్
- మిర్చి పొడి – ½ స్పూన్
- గరం మసాలా – ½ స్పూన్
- నూనె – 1 స్పూన్
- నెయ్యి – 2 స్పూన్లు
- కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
తయారీ విధానం
మొదటగా తెల్ల శెనగలను కనీసం ఒక గంట పాటు నీళ్లలో నానబెట్టి తరువాత ప్రెషర్ కుక్కర్ లో మృదువుగా ఉడికించాలి. అలా ఉడికించిన శెనగలను వడగట్టి పక్కన పెట్టేయండి. అదే సమయంలో బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి తరువాత నీటిని వంపేయాలి.
ఇప్పుడు ఒక మిడిల్ సైజ్ కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. వేడి అయిన తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, మిరియాలు, బిర్యానీ ఆకును వేసి తాలింపు చేయండి. తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేసి కలపండి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి తగినంత ఉప్పు కూడా జతచేసి టమోటాలు మెత్తగా మారేంత వరకు వేపాలి.
తరువాత ఉడికిన శెనగలు, కారం పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి మిశ్రమాన్ని కొద్దిసేపు వేపండి. అప్పుడు బియ్యం జత చేసి తగినంత నీటిని పోసి ఒకసారి మృదువుగా కలపాలి. కొత్తిమీరను మీద నుంచి చల్లి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియమ్ మంటపై ఉడకనివ్వాలి. అనంతరం గ్యాస్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పులావ్‌ను మెల్లగా కలపండి.
ఈ రెసిపీ ఆరోగ్యంతో పాటు అదిరిపోయే రుచిని ఇస్తుంది. పైగా తయారు చేయడం కూడా ఎంతో ఈజీ. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.




