పిల్లలకు UTI రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు ఇలా చేయాల్సిందే..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య ను మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. సమయానికి గుర్తించి చికిత్స ఇస్తే తీవ్రమైన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో UTI లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం.. 11 ఏళ్ల లోపు పిల్లల్లో దాదాపు 3 శాతం అమ్మాయిలు.. 1 శాతం అబ్బాయిలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా UTIతో బాధపడతారు. పుట్టిన తొలి నెలల్లో ముందోలు తీసివేయని (uncircumcised) అబ్బాయిల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఒక ఏడాది దాటిన తర్వాత అమ్మాయిల్లో UTI వచ్చే అవకాశాలు పెరుగుతాయి. జ్వరం ఉన్న పిల్లల్లో 2.9 శాతం నుంచి 7.5 శాతం కేసుల్లో UTI కారణం కావచ్చు. సరైన సమయంలో చికిత్స అందకపోతే.. ఇది కిడ్నీ స్కారింగ్ (kidney scarring), అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీయవచ్చు.
పిల్లల్లో UTI ప్రధాన లక్షణాలు
- శరీర ఉష్ణోగ్రత 100.4°F లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం.
- మూత్రం పోసేటప్పుడు ఏడవడం లేదా అసౌకర్యంగా ఫీల్ అవ్వడం.
- రక్తం కలిసిన, మబ్బుగా ఉన్న లేదా దుర్వాసనతో కూడిన మూత్రం.
- కారణం లేకుండా చిరాకు పడటం, కోపంగా ఉండటం.
- వాంతులు చేసుకోవడం.
- సరిగ్గా ఆహారం తినకపోవడం.
- కొన్నిసార్లు జ్వరం లేదా అలసట మాత్రమే కనిపించవచ్చు.
అనుమానం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లల్లో UTI లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. డాక్టర్లు యూరిన్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తారు. అవసరమైతే చిన్న ట్యూబ్ సాయంతో శాంపిల్ తీసుకోవచ్చు. ఆ శాంపిల్‌లో బ్యాక్టీరియా ఉందా లేదా అనేది రెండు రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయోటిక్స్ వాడాలి. లక్షణాలు తగ్గినప్పటికీ.. డాక్టర్ చెప్పినట్లుగా కోర్సు మొత్తం కచ్చితంగా పూర్తి చేయాలి.
UTI నివారణకు నిపుణుల సూచనలు
- ఎక్కువగా నీళ్లు తాగించాలి.. పిల్లలు రోజంతా తగినంత నీరు తాగేలా చూడాలి. ఇది శరీరంలోని బ్యాక్టీరియాను బయటకు పంపేస్తుంది.
- సరైన శుభ్రత.. టాయిలెట్ తర్వాత ముఖ్యంగా అమ్మాయిలకు ముందు నుంచి వెనక్కి తుడవడం నేర్పించాలి.
- సమయానికి మూత్ర విసర్జన.. పిల్లలు ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి టాయిలెట్‌కి వెళ్లేలా ప్రోత్సహించాలి. మూత్రం ఎక్కువసేపు ఆపుకోకుండా చూడాలి.
- ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్.. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. హార్ష్ సబ్బులు, బబుల్ బాత్స్‌ను వాడకుండా ఉండాలి. మృదువైన, సువాసన లేని సబ్బులను మాత్రమే వాడాలి. ముందోలు తీసివేయని అబ్బాయిల్లో ఫోర్‌స్కిన్‌ను జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
- గాలి తగిలే బట్టలు.. వదులుగా ఉండే కాటన్ బట్టలు వేయించాలి. చెమట పట్టిన లేదా తడిగా ఉన్న బట్టలను వెంటనే మార్చాలి.
మూత్రపిండాలు, యూరెటర్స్ లేదా మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరడం వల్ల UTI వస్తుంది. శరీరం కొన్నిసార్లు వాటిని సహజంగా తొలగించగలిగినప్పటికీ.. కుదరనప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. సరైన శుభ్రత, తగినంత నీరు, ఇతర జాగ్రత్తలతో పిల్లల్లో UTIని నివారించవచ్చు.




