Typhoid Recovery: మీకు టైఫాయిడ్ వచ్చిపోయిందా?.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..
టైఫాయిడ్ అనగానే చాలామందికి ఒకటి, రెండు వారాల తీవ్ర జ్వరం, కడుపు నొప్పి మాత్రమే గుర్తొస్తాయి. అయితే, ఎంతోమందికి ఈ జబ్బు ఆరు వారాల తర్వాత కూడా వదలని పీడలా వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో, వ్యాధి నిర్ధారణలో ఆలస్యం, యాంటీబయాటిక్ నిరోధకత వంటి సవాళ్ల కారణంగా టైఫాయిడ్ తీవ్రత ఎక్కువై, సుదీర్ఘమైన రికవరీ సమస్యగా మారుతోంది. ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా రోగులు ఎందుకు ఇబ్బంది పడతారు? ఈ లాంగ్ టైఫాయిడ్ వెనుక కారణాలు ఏంటి? అనేది వైద్య నిపుణుల అభిప్రాయాలతో ఈ కథనం తెలుపుతుంది.

టైఫాయిడ్ అంటే కేవలం కొద్దిరోజుల జ్వరమే కాదు. కొందరిలో ఇన్‌ఫెక్షన్ పోయిన తర్వాత కూడా నెలల తరబడి అలసట, జీర్ణవ్యవస్థ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనిని వైద్యులు ‘లాంగ్ టైఫాయిడ్’ గా పరిగణిస్తున్నారు. ప్రముఖ సీనియర్ ఎడిటర్ దేబానిష్ అచోమ్ స్వయంగా ఈ అనుభవాన్ని చవిచూశారు.
నిర్ధారణ ఆలస్యం:
దేబానిష్‌కు మొదట తీవ్రమైన అలసట మొదలైంది. ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకపోగా, వికారం మొదలైంది. పరీక్ష చేయించుకోగా, సాల్మొనెల్లా టైఫై బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సోకిందని తేలింది. ఈ సమయానికి కాలేయ ఎంజైములు సాధారణ స్థాయి 50 కంటే దాదాపు ఎనిమిది రెట్లు (400) పెరిగాయి. డాక్టరు టైఫాయిడ్ కాలేయం, ప్రేగులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని వివరించారు.
తిండి… వికారం:
ఆయనకు యాంటీబయాటిక్స్ మొదలుపెట్టిన రికవరీ నెమ్మదిగా సాగింది. “తింటే వాంతి అవుతుంది. తినకపోతే నీరసం. ఇదొక నిరంతర పోరాటం” అంటారాయన. ఇన్‌ఫెక్షన్ క్లియర్ అయినా, అజీర్ణం, అలసట, వికారం అస్సలు తగ్గలేదు. ఇంట్లో పని చేసుకోవటం కూడా కష్టమైంది. అంతేకాక, టైఫాయిడ్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని డాక్టరు చెప్పినట్లు, వాసనపై విచిత్రమైన అయిష్టత తనకు ఏర్పడినట్లు దేబానిష్ తెలిపారు.
సుదీర్ఘ లక్షణాలకు కారణాలు:
ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి అంతర్గత వైద్య విభాగం అదనపు డైరెక్టర్ డా. బి.ఎన్. సింగ్ ప్రకారం, రోగులు ఇన్‌ఫెక్షన్ తర్వాత కూడా కొనసాగే ‘పోస్ట్-ఇన్‌ఫెక్టివ్’ దశలో ఉంటారు. దీనికి ప్రధాన కారణాలు:
కాలేయం, ప్రేగుల వాపు: టైఫాయిడ్ ప్రేగు గోడలను, పీయర్స్ ప్యాచ్‌లను దెబ్బతీస్తుంది. ఇది జీర్ణక్రియను, జీవక్రియను మార్చివేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలిక అలసట, ఆకలి లేకపోవడం, వికారం కొనసాగుతాయి. దాదాపు 40-60 శాతం కేసుల్లో కాలేయ సమస్యలు కనిపిస్తాయి.
నిర్ధారణలో ఆలస్యం: వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే, బ్యాక్టీరియా లోపలి కణజాలాలను ఆక్రమించి, కాలేయం వాపు, పేగుల అల్సరేషన్ తీవ్రతను పెంచుతుంది. ఇది రికవరీని మరింత ఆలస్యం చేస్తుంది.
నాడీ వ్యవస్థ ప్రభావం: కొందరిలో నిరంతర వికారం, వాసన మార్పులు ఆటానమిక్ నాడీ వ్యవస్థలో అసమతుల్యత కారణంగా తలెత్తవచ్చని డా. సింగ్ సూచించారు.
తీవ్ర బరువు తగ్గడం: జ్వరం, వాపు, ఆకలి లేకపోవడం వల్ల శరీరం క్యాటబోలిక్ స్థితిలోకి వెళుతుంది. దేబానిష్ రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గారు. కోల్పోయిన బరువు తిరిగి పెరగటానికి ఒకటి నుండి మూడు నెలల సమయం పడుతుంది.
రికవరీకి నిపుణుల సలహాలు:
డా. సింగ్ రికవరీ కోసం ఈ చిట్కాలను సూచించారు:
నెమ్మదిగా పెంచండి: పని, వ్యాయామాలకు వెంటనే వెళ్లవద్దు. శరీరానికి సమయం ఇవ్వండి.
తేలికపాటి ఆహారం: గంజి, పప్పు నీళ్లు, పెరుగు, ఉడికించిన కూరగాయలు తినండి. నూనె, మసాలాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మానుకోండి.
మైక్రోబయోమ్ రిపేర్: యాంటీబయాటిక్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. పెరుగు, మజ్జిగ, ప్రొబయోటిక్స్ తీసుకోవటం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
తనిఖీ ముఖ్యం: అలసట, వికారం నాలుగు వారాలు దాటినా కొనసాగితే, వైద్యుడిని సంప్రదించండి. కాలేయ పనితీరు, పోషకాహార లోపం కోసం పరీక్షలు చేయించుకోండి.
గుర్తుంచుకోండి: టైఫాయిడ్ తర్వాత రికవరీ అనేది ఒక ప్రయాణం. అది కొద్ది రోజుల్లో పూర్తయ్యే ఘట్టం కాదు.




