తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..
తరచుగా ముఖం కడగడం చర్మానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మంలోని సహజ నూనెలు, రక్షణ పొరను తొలగించి, pH స్థాయిని దెబ్బతీస్తుంది. మొటిమలు, పొడిబారడానికి దారితీస్తుంది. రోజుకు రెండుసార్లు, ఉదయం, రాత్రి సరైన పద్ధతిలో ముఖం కడుక్కోవడం ఉత్తమమని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమందికి తరచుగా ముఖం కడుక్కోవడం ఒక అలవాటు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు తిన్న తర్వాత లేదా వేడిగా అనిపించినప్పుడు వెంటనే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటారు. ఇది మురికి, ధూళిని తొలగించి, మొటిమలను నివారిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే తరచుగా ముఖం కడుక్కోవడం నిజంగా చర్మానికి మంచిదా? లేదా ఇది సమస్యలను కలిగిస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చర్మవ్యాధి నిపుణులు అభిప్రాయం ప్రకారం.. పదేపదే ముఖం కడుక్కోవడం మంచి అలవాటు కాదు. ఈ చర్య వల్ల కొన్ని దుష్ప్రభావాలు తప్పక కలుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
తరచుగా ముఖం కడగడం వల్ల కలిగే ప్రధాన సమస్యలు:
సహజ నూనె తొలగిపోవడం: మీరు ప్రతిసారీ సబ్బు ఉపయోగించి ముఖం కడుక్కున్నప్పుడు, చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి.
రక్షిత పొర బలహీనపడటం: చర్మం యొక్క రక్షిత పొర బలహీనపడుతుంది.
pH స్థాయి మార్పు: ఇది చర్మం యొక్క pH స్థాయిని తగ్గిస్తుంది. చర్మం నల్లగా మారడానికి దారితీస్తుంది.
మొటిమలు పెరిగే అవకాశం: సహజ నూనెలు తొలగిపోవడం, రక్షిత పొర బలహీనపడటం వల్ల చర్మం మరింత నూనెను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మొటిమలకు దారితీయవచ్చు.
పొడిబారడం – చికాకు: చర్మం పొడిబారడం, చికాకు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
రోజుకు ఎన్నిసార్లు ముఖం కడగాలి?
మన చర్మానికి సరైన తేమ, సూర్య రక్షణ చాలా అవసరం. కాబట్టి తరచుగా ముఖం కడుక్కోవడానికి బదులుగా, రోజుకు రెండుసార్లు – ఒకటి ఉదయం.. మరొకటి రాత్రి సరిగ్గా ముఖం కడుక్కోవడం సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖం కడుక్కోవడానికి సరైన మార్గం
చల్లటి నీరు: మీ ముఖాన్ని గోరువెచ్చని లేదా చల్లటి నీటితో తడపండి. వేడి నీటిని వాడకండి.
క్లెన్సర్‌తో శుభ్రం: క్లెన్సర్ తీసుకుని, కనీసం 30 సెకన్ల పాటు సున్నితంగా మసాజ్ చేయండి.
మేకప్ తొలగింపు: ముఖ్యంగా రాత్రిపూట ముఖం కడుక్కోవడానికి ముందు లిప్‌స్టిక్, ఫౌండేషన్, మస్కారా వంటి మేకప్‌ను పూర్తిగా తొలగించాలి.
శుభ్రంగా కడగడం: ముఖాన్ని బాగా కడిగి, మృదువైన టవల్‌తో సున్నితంగా ఆరబెట్టండి.
ముఖం కడిగిన తర్వాత ఏం చేయాలి?
ముఖం కడుక్కోవడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం.
మాయిశ్చరైజర్: ముఖం కడుక్కున్న తర్వాత, ఉదయం అయితే మాయిశ్చరైజర్, రాత్రి అయితే నైట్ క్రీమ్ రాసుకోవడం చర్మ సంరక్షణకు మంచిది.
సన్‌స్క్రీన్: ఎండలో బయటకు వెళ్లేవారు కచ్చితంగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ అప్లై చేసుకోవడం ఇంకా మంచి అలవాటు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




