పెయిన్ కిల్లర్స్‌తో యాంటీబయాటిక్స్ కలిపి వేసుకుంటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
మనలో చాలా మంది నొప్పి మందులను యాంటీబయాటిక్స్‌తో కలిపి వాడుతుంటారు. కానీ తాజా పరిశోధనలు ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నాయి. ఇలాంటి కలయిక వల్ల బ్యాక్టీరియా మరింత శక్తివంతమై యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే స్థితికి చేరుకుంటుంది. దీని ఫలితంగా సాధారణ ఇన్ఫెక్షన్లకే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

సాధారణంగా మనం వాడే నొప్పి మందులను (Painkillers) యాంటీబయాటిక్స్‌తో కలిపి వేసుకుంటే.. అది చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా మరింత త్వరగా ఆ యాంటీబయాటిక్ లను తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది. ఫలితంగా ఆ సూక్ష్మక్రిములు ఇంకా ప్రమాదకరంగా మారతాయి.
పరిశోధనలో ఏం తెలిసింది..?
దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. నొప్పి మందులు ఒంటరిగా వాడినా కూడా బ్యాక్టీరియా నిరోధకత పెరుగుతుంది. కానీ వాటిని యాంటీబయాటిక్స్‌తో కలిపి వాడినప్పుడు.. ఆ నిరోధకత మరింత వేగంగా పెరిగింది.
ముఖ్యంగా E.coli అనే బ్యాక్టీరియాపై ఈ పరిశోధన చేశారు. ఈ బ్యాక్టీరియా ప్రేగులు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. సిప్రోఫ్లోక్సాసిన్ అనే యాంటీబయాటిక్‌ను ఇబుప్రోఫెన్, పారాసెటమాల్‌తో కలిపి వాడినప్పుడు.. బ్యాక్టీరియా చాలా మార్పులు చేసుకుని శక్తివంతమైంది.
నిపుణుల హెచ్చరిక
నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. యాంటీబయాటిక్ నిరోధకత అనేది మనం అనుకున్నదానికంటే చాలా క్లిష్టమైన సమస్య. ఇది కేవలం యాంటీబయాటిక్‌ల వల్ల మాత్రమే కాదు.. మనం వాడే ఇతర మందుల వల్ల కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఒకేసారి చాలా మందులు వాడేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
నొప్పి నివారణ మందులు మాత్రమే కాకుండా.. నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలకు వాడే మందులు కూడా E.coli వంటి బ్యాక్టీరియాలో ఈ నిరోధకతను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విస్తృత ప్రభావం
ఇబుప్రోఫెన్, పారాసెటమాల్‌తో పాటు.. మధుమేహానికి వాడే మెట్ఫార్మిన్, కొలెస్ట్రాల్‌కు వాడే అటోర్వాస్టాటిన్ వంటి మందులను ఒకేసారి వాడినప్పుడు కూడా ఇలాంటి సమస్యే వస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల ఈ మందులను వాడటం మానేయాలని కాదు.. కానీ యాంటీబయాటిక్స్‌తో కలిపి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
భవిష్యత్తులో ప్రమాదం
2024లో ప్రచురించబడిన మరో అధ్యయనం ప్రకారం.. యాంటీబయాటిక్‌లకు తట్టుకునే ఈ రకమైన బ్యాక్టీరియా వల్ల 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు.
ఆధునిక వైద్యంలో యాంటీబయాటిక్ నిరోధకత ఒక పెద్ద సమస్య. నొప్పి మందులను యాంటీబయాటిక్స్‌తో కలిపి వాడితే ఈ సమస్య పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వైద్యుల సలహాలు తీసుకోవడం, అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నివారించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




