Increase Of TB Cases : భారత్‌లో పెరుగుతున్న టీబీ కేసులు.. ఆ అలవాట్లే ప్రధానం కారణం

పోషకాహార లోపం, మధుమేహం, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ), ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వల్లే దేశంలో టీబీ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉన్న టీబీ కేసుల్లో దాదాపు 44 శాతం మందికి పైన పేర్కొన్న అలవాట్లల్లో ఏదో ఒకటి ఉందని తేలింది.

Increase Of TB Cases : భారత్‌లో పెరుగుతున్న టీబీ కేసులు.. ఆ అలవాట్లే ప్రధానం కారణం
Tb
Follow us

|

Updated on: Mar 26, 2023 | 6:00 PM

భారతదేశంలో టీబీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల వారణాసిలో వన్ వరల్డ్ టిబి సమ్మిట్ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండియా టీబీ నివేదిక 2023ని విడుదల చేసింది . పోషకాహార లోపం, మధుమేహం, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ), ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వల్లే దేశంలో టీబీ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉన్న టీబీ కేసుల్లో దాదాపు 44 శాతం మందికి పైన పేర్కొన్న అలవాట్లల్లో ఏదో ఒకటి ఉందని తేలింది. 2020, 2021లో టీబీ కేసుల్లో స్వల్ప క్షీణత కనిపించినప్పటికీ 2022లో మాత్రం కేసులు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంటుంది. 2022లో దాదాపు 24.2 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే దాదాపు 13 శాతం పెరుగుదల కనిపించింది. ప్రతి లక్ష జనాభాకు సుమారుగా 172 టీబీతో బాధపడుతున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను బట్టి అర్థం అవుతుంది. అలాగే  2022లో నిర్ధారణ అయిన మొత్తం ఎండీఆర్, ఆర్ఆర్ కేసుల సంఖ్య 63,801గా ఉంది. ముఖ్యంగా టీబీ కేసులు కనుగొనడంలో చేసే ప్రయత్నాలను బలోపేతం చేయడం ద్వారా ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ప్రతి లక్ష జనాభాకు గతంలో 763 పరీక్షలు చేస్తే 2022లో మాత్రం ఈ సంష్య 1281కు చేరింది. 

భారతదేశంలో చికిత్స ఇలా

టీబీతో బాధపడుతున్న వ్యక్తుల సంరక్షించడం ద్వారా టీబీ సమస్యకు చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యల కారణంగా టీబీ నిర్వహణలో భారతదేశంలో చాలా విస్తృతమైన పురోగతిని సాధించింది. ముఖ్యంగా టీబీ రోగుల మరణాలను తగ్గించడానికి రోగ నిర్ధారణ సమయంలోనే రోగి ఆస్పత్రిలో చేరే విధంగా విభిన్న సంరక్షణకు సంబంధించి సమగ్ర ప్యాకేజీని ప్రోగ్రామ్ పరిచయం చేసింది. వివిధ రాష్ట్రాలు/యూటీలు విభిన్న పద్ధతులను అవలంబిస్తూ సంరక్షణ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. అలాగే డ్రగ్ రెసిస్టెన్స్ రోగుల నిర్వహణలో ఉన్న అడ్డంకులను తగ్గించడంలో ఎన్‌టీఈపీ గణనీయమైన సేవలను అందిస్తుంది. ముఖ్యంగా టీబీ రోగులు, వారి సన్నిహిత పరిచయాలు ఉన్న వారిని తక్షణం పరీక్షించడం ద్వారా టీబీ వ్యాధి తీవ్రం కాకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. టీబీ రోగుల సంరక్షణ కోసం లాస్ట్-మైల్ సర్వీస్ డెలివరీని అందించడానికి కేంద్రం ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లకు టీబీ సేవలను వికేంద్రీకరించింది.

మందులు మాత్రమే వ్యాధిని తగ్గించలేవు

పోషకాహార లోపం, మధుమేహం, హెచ్ఐవీ, పొగాకు ధూమపానం, ఆల్కహాల్ వంటి కొమొర్బిడిటీలు టీబీతో బాధపడుతున్న వ్యక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పోషకాహార లోపం సమస్యను ఎదుర్కోడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పోషన్ మాహ్ కార్యక్రమం ద్వారా టీబీతో బాధపడుతున్న వ్యక్తులకు అదనపు పోషకాహార సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా టీబీ చికిత్స పూర్తి అయినా కొన్ని రోజుల పాటు శరీరానికి పోషకాహారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వమే పోషకాహార లోప నివారణకు చర్యలు తీసుకోవడంతో టీబీ వల్ల కలిగే మరణాలు చాలా వరకూ తగ్గాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే సూక్ష్మ బ్యాక్టీరియా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బాక్టీరియా ఎప్పుడూ చనిపోదని, కానీ అది అందరికీ సోకదని పేర్కొంటున్నారు. కాబట్టి చికిత్స తర్వాత కూడా ఒక వ్యక్తి సరైన మొత్తంలో ప్రోటీన్లు, అవసరమైన పోషకాలను తీసుకోకపోతే, వారు వ్యాధికి లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. అయితే టీబీ బ్యాక్టీరియా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు వంటి శరీరంలోని ఏదైనా భాగంపై దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టీబీ బాక్టీరియా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి, సాధారణ రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల కంటే టిబి వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జాగ్రత్తలతోనే టీబీ నివారణ

టీబీ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కాకుండా సంఘంగా మనం కూడా ఈ వ్యాధిని అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కఫంలో రక్తం వంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి తగిన సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య, పోషకాహారం అధికంగా ఉండే అధిక-ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీబీతో బాధపడుతున్న కుటుంబ సభ్యుడు వల్ల ఇతర సభ్యులకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. టీబీ అనేది పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, అయితే టీబీను సముచితంగా నిర్వహిస్తే వేగంగా నివారించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..