ఇంట్లోనే యూరిక్ యాసిడ్‌ను ఇలా తగ్గించండి..! జస్ట్ ఈ డ్రింక్స్ తాగితే చాలు..!
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గౌట్, కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరం యూరిక్ యాసిడ్ ను సరిగ్గా బయటకు పంపలేనప్పుడు అది కీళ్లలో స్ఫటికాల రూపంలో చేరి నొప్పి, వాపును కలిగిస్తుంది.

ఈ సమస్యలను నివారించాలంటే.. తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. దాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించవచ్చు. వీటిని ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆ చిట్కాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చౌ చౌ డ్రింక్
చౌ చౌ డ్రింక్ తయారు చేసుకోవడానికి సగం కప్పు చౌ చౌ కాయ ముక్కలు, పావు చెంచా జీలకర్ర పొడి, పావు చెంచా సోంపు పొడి అవసరం. ముందుగా చౌ చౌ కాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి కొద్దిగా పసుపు వేసి మళ్లీ కడిగి మిక్సీలో కొద్దిగా నీటితో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ రసాన్ని వడకట్టి అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి కలిపి తాగితే యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సహాయపడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్
యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి మరో మంచి డ్రింక్ ఉంది. ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇది శరీరంలో ద్రవ పరిమాణాన్ని సమతుల్యం చేస్తూ.. కీళ్ల పని తీరును మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను అనుసరించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




