Blood pressure: పోరపాటున కూడా ఈ టైమ్ లో బీపీ చెక్ చేసుకోకండి.. ఆ రిస్క్ తప్పదు!
రోజువారి జీవితంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అదే, ఇంట్లో రక్తపోటును సరిగ్గా పరీక్షించకపోవడం. చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు బీపీ చెక్ చేసి, తప్పుడు రీడింగ్స్ చూసి ఆందోళన పడుతుంటారు. కానీ, రక్తపోటును సరైన సమయానికి, సరైన పద్ధతిలో పరీక్షిస్తేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. అవేంటో తెలుసుకుని, మీ ఆరోగ్యానికి ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకోండి.

రక్తపోటు (బీపీ) స్థాయిలు రోజులో హెచ్చుతగ్గులకు లోనవుతాయి. శరీరంలోని సహజ చక్రాలు, శారీరక శ్రమ, వాతావరణ కారకాలు ఈ మార్పులకు కారణాలు. అందుకే ఇంట్లో బీపీ పరీక్షించుకునేవారు సరైన సమయం, పద్ధతి పాటిస్తేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
సరైన సమయం ఇదే
రక్తపోటు పరీక్షకు ఉదయం, సాయంత్రం వేళలు మంచివి. ఉదయం అల్పాహారం, మందులు వేసుకోకముందు పరీక్ష చేయాలి. ఇది మన సహజ రక్తపోటు స్థాయిని తెలియజేస్తుంది. అలాగే, రాత్రి పడుకోబోయే ముందు పరీక్ష చేస్తే, రోజంతా మన శరీరం ఒత్తిడిని ఎలా తట్టుకుందో తెలుస్తుంది.
సరిగ్గా పరీక్షించే విధానం
సిద్ధంగా ఉండండి: ఏదైనా తిన్న తర్వాత, తాగి, వ్యాయామం చేసిన తర్వాత కనీసం అరగంట ఆగి పరీక్ష చేయాలి.
శరీర స్థితి: వెనుక భాగం ఆనుకునే కుర్చీలో కూర్చోండి. మీ పాదాలు నేలపై ఉంచి, కాళ్లు క్రాస్ చేయకండి. చేతిని గుండెకు సమానమైన ఎత్తులో టేబుల్ పై పెట్టండి.
కఫ్: మీ చేతికి సరిపోయే కఫ్‌ను ఎంచుకోవాలి. మోచేయికి రెండు సెంటీమీటర్ల పైన కఫ్‌ను బిగించాలి.
రీడింగ్: పరీక్ష చేస్తున్నప్పుడు కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి. రెండు మూడు రీడింగ్స్ తీసుకుని, వాటి మధ్య ఒక నిమిషం విరామం ఇవ్వాలి. వాటిలో ఒక రీడింగ్ ఎక్కువగా ఉంటే, దానిని పక్కన పెట్టి మిగిలిన రీడింగ్స్ సగటును లెక్కించాలి.
వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
మీ ఇంట్లో తీసిన రీడింగ్స్ పదేపదే 130/80 mm Hg పైన ఉంటే, లేదా ఉదయం, సాయంత్రం రీడింగ్స్ మధ్య పెద్ద తేడా ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వైద్య సలహా కోసం డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.




