Eye Care Tips: వర్షాకాలంలో తరచూ ఇబ్బంది పెట్టే కండ్ల కలక, వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Eye Care Tips In Monsoon: వర్షాకాలం (Monsoon) అంటే అందరికీ చాలా ఇష్టం . చిన్న పిల్లలు కూడా వర్షాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. వర్షంలో సరదాగా గడపాలనుకుంటారు. అయితే అన్ని సీజన్లోలాగా ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం..

Eye Care Tips In Monsoon: వర్షాకాలం (Monsoon) అంటే అందరికీ చాలా ఇష్టం . చిన్న పిల్లలు కూడా వర్షాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. వర్షంలో సరదాగా గడపాలనుకుంటారు. అయితే అన్ని సీజన్లోలాగా ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక సవాలు లాంటిది. ముఖ్యంగా వర్షాకాలంలో కంటి సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు మురికి నీరు కళ్లలోకి చేరి ఇన్‌ఫెక్షన్, కళ్లు ఎర్రబారడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈక్రమంలో సున్నితమైన కళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలంటున్నారు. మరి వర్షాకాలంలో కళ్ల సంరక్షణ కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.
కండ్ల కలకతో జాగ్రత్త..
వర్షాకాలంలో చాలామందికి కండ్ల కలక సమస్య తలెత్తుతుంది. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది అంటువ్యాధి. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ సోకుతుంది. సాధారణ కండ్ల కలక వస్తే వారం పాటు ఇబ్బంది పెట్టిన తర్వాత తగ్గిపోతుంది. అదే వైరస్‌తో కండ్ల కలక వస్తే మూడు వారాల పాటు ఉండొచ్చు. కొంతమందికి మందులు వాడకపోయినా వారంలో తగ్గిపోతుంది. కంటికి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. ఇది కాకుండా వర్షాకాలంలో కార్నియాకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ల కేసులు కూడాపెరుగుతాయి. వాతావరణంలో పెరిగిన తేమ ఈ సమస్యలకు కారణమవుతుంది. వర్షంలో నానడం వల్ల కళ్లకు హాని కలగదు. అయితే ఆ తర్వాత శుభ్రమైన నీటితో కళ్లను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే పై సమస్యలన్నీ వేధిస్తాయి.




కళ్లను ఎలా కాపాడుకోవాలంటే..
వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో చేతులు కడుక్కోవాలి. కళ్లను తరచుగా తాకకూడదు. శుభ్రమైన నీటితో రోజుకు రెండుసార్లు కళ్లను కడగాలి. కంటిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించాలి. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా కళ్లకు చికిత్స చేయవద్దు. ఇలా చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. అంతేకాదు కంటి జబ్బులతో బాధపడేవారు ఈ సీజన్‌లో బయటికి వెళ్లకూడదు. వర్షాకాలంలో నిపుణులు చెప్పే ఈ చిట్కాలను పాటించడం ద్వారా మన కళ్లను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




