Yashoda Review: యశోద మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ మెడికల్ స్కామ్ థ్రిల్లర్..
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. హరి హరీష్ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చింది. మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న ఈ సినిమా ఎలా ఉంది..?
మూవీ రివ్యూ: యశోద
నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్, శత్రు తదితరులు
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: M సుకుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: శివలెంక కృష్ణ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి హరీష్
విడుదల తేదీ: 11 నవంబర్ 2022
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. హరి హరీష్ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చింది. మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న ఈ సినిమా ఎలా ఉంది..? ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయా..? సమంత చేసిన ప్రచారం సినిమాకు ఎంతవరకు హెల్ప్ అయింది..? యశోద సినిమా ఎలా ఉంది..?
కథ:
యశోద (సమంత) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మా నాన్న లేని తను.. తన చెల్లి బృందా (ప్రీతి అస్రాని)తో కలిసి ఉంటుంది. ఉన్నట్లుండి ఆమె చెల్లి మిస్ అయిపోతుంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా లాభం ఉండదు. అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో సరోగసి కోసం మధుబాల (వరలక్ష్మి శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) కలిసి నిర్వహిస్తున్న హాస్పిటల్‌కు వస్తుంది. అక్కడ యశోదతో పాటు వందల మంది అమ్మాయిలు సరోగసి కోసం వస్తారు. అయితే అక్కడ కేవలం సరోగసి మాత్రమే కాదు.. ఇంకేదో జరుగుతుందని అనుమానం యశోదకు వస్తుంది. దాంతో అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో యశోదకు ఎదురైన పరిస్థితులు ఏంటి..? అందులో ఆమె సఫలమైందా..? చెల్లి దొరికిందా లేదా అనేది అసలు కథ..
కథనం:
మెడికల్ మాఫియా నేపథ్యంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా విడుదలైన యశోద కూడా అలాంటి సబ్జెక్టే. కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాతో ప్రేక్షకులకు చెప్పాలని చూసారు దర్శకులు హరి హరీష్. అయితే ఓ సినిమా ఆకట్టుకోవాలంటే కాన్సెప్ట్, కంటెంట్, ఎగ్జిగ్యూషన్ పర్ఫెక్టుగా ఉండాలి. యశోద విషయంలో కాన్సెప్ట్ బాగుంది.. కంటెంట్ ఆకట్టుకుంటుంది.. కానీ కీలకమైన ఎగ్జిగ్యూషన్ విషయంలోనే అక్కడక్కడా లోపాలు కనిపించాయి. ఇదే సినిమాను సూపర్ అనే స్థాయి నుంచి యావరేజ్ దగ్గరే ఆపేసాయి. దర్శకులు చెప్పాలనుకున్న పాయింట్ అదిరిపోయింది. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. అయితే కీలకమైన సన్నివేశాల్లో మాత్రం ముందుగానే స్టోరీ రివీల్ అయిపోయింది. అదొక్కటే ఈ సినిమాకు ప్రధానమైన మైనస్‌గా మారింది. ఓ వైపు యశోద సరోగసి కోసం హౌజ్‌కు రావడం.. మరోవైపు బయట వరస మర్డర్లపై సాగే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సరోగసిని పాయింట్ చేస్తూ కథ చెప్తున్నా.. లోపల మాత్రం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. సినిమాకు అదే మెయిన్ ట్విస్ట్.. అది మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.. అక్కడక్కడా థ్రిల్లింగ్ మూవెంట్స్ బాగున్నాయి. అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. కథనం కూడా అక్కడే మరింత ఆసక్తికరంగా ఉండాల్సింది. సమంత పాత్రను ఓపెన్ చేసిన విధానం బాగుంది.. ఈ ఎలివేషన్స్‌లో పోకిరి ముద్ర ఉండటం వల్ల.. ఆటోమేటిక్‌గా అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సిందేమో అనిపించింది. అంత పెద్ద క్రైమ్ చుట్టూ తిరిగే కథ.. సడన్‌గా క్లోజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్ సరోగసి హౌజ్‌లో దివ్య శ్రీపాద, సమంత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే అమ్మతనం గురించి వచ్చే సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్ బాగానే క్యారీ అయింది. ఓవరాల్‌గా మంచి సినిమా చూసిన ఫీలింగ్ యశోద కలిగిస్తుంది.
నటీనటులు:
సమంత గురించి ఏం చెప్పాలి..? ఈ సినిమా కోసం ఆమె ప్రాణం పెట్టారని చూస్తేనే అర్థమవుతుంది. యశోద కారెక్టర్‌లో అద్భుతంగా నటించింది స్యామ్. అలాగే యాక్షన్ సీన్స్ అదరగొట్టారు. ఆమె స్టంట్స్‌కు హ్యాట్సాఫ్. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కారెక్టర్ బాగుంది. ఈయన పాత్రకు ట్విస్ట్ ఇచ్చినా ముందుగానే అర్థమవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ పాత్రలు ఓకే మిర్చి సంపత్ కారెక్టర్ ఆకట్టుకుంటుంది. సమంత చెల్లిగా ప్రీతి అస్రాని బాగుంది. శత్రుకు మంచి పాత్ర పడింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
మణిశర్మ సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు.. సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ. పులగం చిననారాయణ, ఛెల్లా భాగ్యలక్ష్మి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. దర్శకులు హరి హరీష్ చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. మరింత పకడ్బందీగా చెప్పుంటే ఇంకా ఆకట్టుకునేది యశోద. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా యశోద.. ఇంట్రెస్టింగ్ మెడికల్ స్కామ్ థ్రిల్లర్.. కానీ కండీషన్స్ అప్లై.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.